● ఇచ్చిన హామీలు అమలు చేయండి
● చంద్రబాబుకు బీఎసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ డిమాండ్
సాక్షి, మదనపల్లె : మదనపల్లె అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.గౌతమ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20న ఇక్కడికి వస్తున్న చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని వాటిని నెరవేర్చాలన్నారు. ప్రధానంగా హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి మదనపల్లెలోని అన్ని చెరువులు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కృష్ణా జలాలతో నింపాలని కోరారు. బీటీ కళాశాలను యూనిర్సిటీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. మదనపల్లెలో టమాట ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేయాలని కోరారు. స్థానిక మెడికల్ కళాశాల ప్రయివేటీకరణ చర్యలను నిలిపివేసి, వాటి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను మదనపల్లె జిల్లాగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వ భాగస్వామ్య కూటమి పార్టీల నేతల అవినీతి, భూకబ్జాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్‌సీపీ నేతలపై లోకేష్ అవినీతి, భూకబ్జాలు, అక్రమాలపై ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు మదనపల్లెలో కూటమి నాయకులపై భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు ఆధారాలతో సహా రుజువయినప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, నిష్పక్షపాతంగా చంద్రబాబు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


