రామాపురం: వైఎస్సార్ కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్దమల్ల గ్రామం దూదేకులపల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న దారుణ హత్యాయత్నం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఫరీద్ అనే వ్యక్తి, వైఎస్సార్‌సీపీ కార్యకర్త బత్తల రమణ తమ్ముడైన బత్తల రాజాపై పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన రాజా పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఫరీద్‌కు అధికార పక్షం అండదండలు ఉన్నాయని, ఆ రాజకీయ ధీమాతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడని బాధిత కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, బాధితుల నుంచి సమాచారం రాగానే కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపారు. యువకుడిపై కత్తిపోట్ల ఉదంతంతో సుద్దమల్ల గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


