మదనపల్లె టౌన్: వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఘటనలపై జిల్లా ఆసుపత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీకి చెందిన శివశంకర్ (45) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. భార్య ఇంట్లో వంట చేస్తుండగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. పిల్లలు గమనించి కేకలు వేయడంతో భార్య, స్థానికులు వచ్చి అతడిని కాపాడారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. ములకలచెరువు మండలం బురకాయలకోటలో మహబూబ్ బాషా భార్య షకీలా (38) కుటుంబీకులతో గొడవపడి ఫినాయిల్ తాగింది. వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లికి చెందిన శివశంకర్ భార్య భార్గవి (25) భర్తతో గొడవపడి విషం తాగింది. కుటుంబీకులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంటోంది.


