మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణంలో కన్నీళ్లు తెప్పించే ఘటన జరిగింది. బిడ్డ పుట్టిందన్న ఆనందంతో భార్యకు కాఫీ తీసుకురావడానికి పరుగులు తీసిన యువకుడిని కారు ఢీకొట్టింది. దీంతో రెండు కాళ్లు విరిగి అతడు కూడా మంచం పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలచెరువు మండలం కాలవపల్లికి చెందిన మౌలాలి తన భార్య రేస్మాను ప్రసవం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆమె అర్ధరాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ‘ఆడబిడ్డ పుట్టింది‘ అని చెప్పడంతో సంతోషంతో భార్యకు కాఫీ తీసుకురావాలని మౌలాలి ఆసుపత్రి వద్ద ఉన్న తిరుమల హోటల్ వైపు పరుగులు తీశాడు. రోడ్డు దాటే క్రమంలో ఆసుపత్రి వద్ద వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మౌలాలి రెండు కాళ్లు విరిగాయి. స్థానికులు అతన్ని అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.


