● భూసార పరీక్షలు తప్పనిసరి
● విత్తనశుద్ధితో మొక్కకు సంరక్షణ
● వేరుశనగ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు
గుర్రంకొండ : ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే వేరుశనగ పంటలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. జిల్లాలో రైతులకు ముఖ్యమైన సాగు పంట వేరుశనగ. పడమటి ప్రాంతాల్లో 40 శాతం మంది రైతులు ఈ పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వేరుశనగ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
విత్తనకాయల పరీక్ష పాటించకపోతే నష్టమే
ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ పంట సాగు చేయడానికి ముందుగా విత్తనకాయల పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో విత్తనకాయల్లో మొలకెత్తే శాతం తెలిసిపోతుంది. ఒకట్రేలో మట్టి, ఇసుక, ఎరువులతో నింపి 100 విత్తన గింజల్ని నాటాల్సి ఉంటుంది. 12 రోజుల అనంతరం మొలకెత్తే శాతం బట్టి నాణ్యత పరీక్ష తెలుస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 నుంచి 90 శాతం వరకు మొలకెత్తితేనే నాణ్యమైన విత్తనాలుగా నిర్ధారించవచ్చు. కాబట్టి ప్రతి రైతు తాము కొనుగోలు చేసిన విత్తనాలను ముందుగా ఇలా పరీక్ష చేసుకోవాలి.
రెండేళ్లకు ఒకమారు భూసార పరీక్షలు
వేరుశనగ సాగు చేసే పొలాల్లో రెండేళ్ల కొకమారు భూసార పరీక్షలు చేయించాలి. పంట సాగు చేసిన ప్రతి సారి భూమిలో నత్రజని, భాస్వరం వినియోగం ఎక్కువగా ఉంటుంది. భూసార పరీక్షలో ఎంత మేరకు వీటి శాతం తగ్గిందో తెలుసుకోవచ్చు. తద్వారా పంట సాగు ముందు పొలంలో తగినంత మేరకు వీటిని పిచికారి చేస్తే భూసారం మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. వ్యవసాయాధికారులే రైతుల పొలాల వద్దకు వచ్చి భూసార పరీక్షల నిమిత్తం మట్టిని సేకరించుకొని వెళుతుంటారు.
సూక్ష్మపోషకాలు
వేరుశనగ పంట సాగు చేసే పొలాల్లో సూక్ష్మపోషకాల సమతుల్యత సరి చేసుకోవాల్సి ఉంటుంది. పొలాలను దుక్కులు చేసేటప్పుడు, విత్తనాలు వేసే సమయంలో సూక్ష్మ పొషకాల మందులను వినియోగించాల్సి ఉంటుంది.
బోరాన్, సల్ఫర్
వేరుశనగ పంట సాగులో బోరాన్, సల్ఫర్‌ను వినియోగించాలి. తద్వారా వేరుశనగలో కాయలు నాణ్యతగా వస్తాయి. వాటి బరువు కూడా పెరుగుతుంది.
జింక్
జింక్ వినియోగించడం వల్ల వేరుశనగ మొక్కల్లో కాండం, మొక్క ఎదుగుదల ఎక్కువగా, ధృడంగా ఉంటుంది. కాయల్లో గింజ ఏర్పడే శాతం పెరుగుతుంది.
జిప్సం
పొలాల్లో జిప్సం చల్లడం వల్ల గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఏర్పడుతుంది. పొలాలు దుక్కులు చేసే సమయంలో ఎకరానికి 200 కేజీల జిప్సం చల్లాలి.
విత్తనశుద్ధి తప్పనిసరి
వేరుశనగ పంట సాగులో విత్తనశుద్ధి చేసుకోవాలి. డీఎమ్ 45 అనే రకం విత్తనశుద్ధి మందును ఎకరానికి సరిపడే విత్తన గింజల్లో 180 గ్రాములు కలపాల్సి ఉంటుంది. ఈ మందును విత్తనగింజల్లో కలిపిన తరువాతే పొలంలో విత్తాలి. తద్వారా గింజల్ని ఆవహించే తినేసే వేరుతొలుచు పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. అంతేకాక విత్తనాలు మెలకెత్తే వరకు సంరక్షణగా ఉంటాయి.
కలుపు మొక్కల నివారణ
వేరుశనగ పంట సాగులో కలుపు మొక్కల నివారణ మందులు వాడాలి. పొలంలో విత్తనాలు వేసిన రోజు సాయంకాలం గానీ, ఆ మరుసటి రోజు గానీ ఈ రకం మందులు పిచికారి చేయాలి. ఎకరం పొలానికి ఒకటిన్నర లీటరు పెండామిథాలిన్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట పొలంపై పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు వేసినప్పటి నుంచి రెండు నెలల పాటు కలుపు మొక్కలు పెరగకుండా చూడవచ్చు.
అంతర్ పంటలు
వేరుశనగ సాగులో అంతర్ పంటలు కూడా సాగు చేయడం వల్ల పంటకు ఎంతో రక్షణగా ఉంటుంది. పొలంలో విత్తనగింజలు వేసే ఆరుసాళ్లు(వరుసలు)కు ఒక సాళు కందులు, అలసందలు వంటి విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పొలం చుట్టూ రెండు నుంచి నాలుగు వరసలు జొన్నలు వేయాలి. వీటి వల్ల పక్క పొలాల నుంచి వైరస్, ఇతర క్రిమికీటకాలు, ఎర్రగొంగళి పురుగులు పంటను ఆహించకుండా చేయవచ్చు.
లోతైన దుక్కులతో మేలు
వేరుశనగ సాగుకు ముందే పొలాల్లో లోతైన దుక్కులు చేయడం వల్ల అధిక పంట దిగుబడులు సాధించవచ్చు. సాధారణంగా పడమటి మండలాల్లో మే నెలలో తొలకరి వర్షాలకు దుక్కులు చేయడం ప్రారంభిస్తారు. పలువురు రైతులు దుక్కుల చేసే ముందు ఎరువులను పొలాలపై చల్లుతారు. ఆ తరువాత లోతైన దుక్కులు చేపడతారు. తద్వారా పొలం పైనున్న ఎరువులు భూమి లోపలకి చేరి పంట సాగు ప్రారంభానికి ముందే సారవంతమైన ఎరువుగా మారుతుంది. పంట సాగు చేసే సమయం కంటే ముందు కనీసం రెండు మార్లు లోతైన దుక్కులు చేస్తుంటారు. తద్వారా పంట సాగు చేసే పొలం ఎంతో సారవంతమవుతుంది.


