మదనపల్లె టౌన్ : జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలంలోని పాత ములకలచెరువుకు చెందిన రాజప్ప(36) తన భార్య గాయత్రితో కలిసి మండలంలోని బురుజుపల్లికి సొంత పనిపై వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా మార్గంమధ్యలోని బురుజుపల్లె సమీపంలో టాటా ఏస్ వాహనం వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ రాజప్పను వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలచెరువు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్తవారిపల్లి పంచాయతీ పూలమాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప(60) ఊరికి సమీపంలోని తన వ్యవసాయ పొలం వద్దకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణప్ప తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


