రాయచోటి: ర్యాలీగా వెళుతున్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి తదితరులు
సాక్షి అన్నమయ్య : చంద్రబాబు సర్కార్ చేస్తున్న వంచనపై వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపుకు కార్యకర్తలు కదం తొక్కారు. అధికారంలోకి రాకముందు ఒక మాట...వచ్చిన తర్వాత మరోమాట చెబుతూ పేద ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న కూటమి సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించారు. పథకాలలో కోత...హామీల విస్మరణపై వైఎస్సార్ సీపీ నాయకులు రణం బాట పట్టారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో ఫ్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, నాయకులు, అభిమానులు కదలడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. పార్టీ జెండాలు చేతబూని, టోపీలు ధరించి..ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో జిల్లా హోరెత్తింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. జై జగన్ నినాదాలతోపార్టీ శ్రేణులు నినదించాయి.
నిరసనలో ప్రధాన నేతలు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ కీలక నేతలు పాల్గొని ప్రభుత్వం పట్ల తమ నిరసన తెలియజేశారు. రాయచోటిలో జన నీరాజనం కనిపించింది. ప్రధాన రోడ్లన్నీ వైఎస్సార్ సీపీ నేతలతో నిండిపోయాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాయచోటిలో పార్టీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా నేతాజీసర్కిల్, ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే జిల్లా కేంద్రమైన మదనపల్లెలోనూ వైఎస్సార్‌సీపీ నిరసనలు మిన్నంటాయి.
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు ర్యాలీలో కదులుతుండగా మిషన్ కాంపౌడ్ నుంచి చిత్తూరు బస్టాండు వరకు కొనసాగింది. పుంగనూరులో కూడా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ పోకల అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీ బస్టాండులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ర్యాలీ అంబేడ్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు నినాదాలుచేస్తూ ముందుకు సాగారు.పీలేరు నియోజకవర్గంలో కూడా పార్టీ శ్రేణులు కదం తొక్కారు. నియోజకవర్గంలోని కలకడలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి ఊహించని స్పందన లభించింది. స్థానిక శ్రీనివాసులు రెడ్డి కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ దగ్గర వైఎస్సార్ చౌక్ వారికి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమీపంలోని టమాటా మార్కెట్ నుంచి మూడురోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, మండల నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమానికి స్పందన రావడం...అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతమైంది.
మదనపల్లె: ర్యాలీలో పొల్గొన్న నిసార్ అహ్మద్, దేశాయి తిప్పారెడ్డి తదితరులు
కలకడ:ర్యాలీలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పుంగనూరులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప
అంగళ్లులో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు


