మదనపల్లె సిటీ : బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల(మాయబజార్ ), స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ‘మన బడి – మన పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు చాక్‌లెట్లు పంచి పెట్టి స్వాగతం పలికారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఈ ఏడాది కొత్తగా 1వ తరగతిలో 9,559 మంది చేరినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు పురం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


