● జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి : ప్రజా సమస్యలను శాశ్వతంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ఒక నియోజకవర్గం, ఒక మండలం, నాలుగు సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అధికారి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా పని చేస్తుందన్నారు. తదుపరి రాబోయే మూడు శుక్రవారాలు ఈ కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతుందని, ఈ అవకాశాన్ని రాయచోటి పట్టణం, రూరల్ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాస్థాయి అధికారి ఒక నియోజకవర్గాన్ని, ప్రత్యేక అధికారి ఒక మండలాన్ని, మండల స్థాయి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వరుసగా నాలుగు శుక్రవారాలు పర్యటించాలని సూచించారు. మొదటి సందర్శనలో సమస్యలను గుర్తించడం, రెండో సందర్శనలో పరిష్కార మార్గాలను ఖరారు చేయడం, మూడో సందర్శనలో అమలు చర్యలు చేపట్టడం, నాల్గో సందర్శన నాటికి సమస్యల పరిష్కారాన్ని పూర్తి చేయాలన్నారు. నిరంతర పర్యటనల ద్వారా ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు అధికారులకు ప్రత్యక్షంగా అవగాహన అవుతాయని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ యామినీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్య, వైద్య, నీటిపారుదల తదితర వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


