గుర్రంకొండ: పచ్చరొట్ట ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త విశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని తరిగొండ రైతుసేవాకేంద్రంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొలాల సంరక్షణపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేల సంరక్షణ కోసం పచ్చిరొట్ట ఎరువులు,జీవ శిలీంధ్రనాసినులను రైతులు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. పంటలు సాగు చేసే సమయంలో పచ్చరొట్ట ఎరువులైన జనుము,జీలుగ, పిల్లిపెసర వంటి పంటలు పెంచి దుక్కుల్లో కలియ దున్నాల్సి ఉంటుందన్నారు. ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గు చూపాలని తెలిపారు. అపరాలు, చిరుధాన్యాల పంటను సాగు చే యడం ద్వారా రైతుకు నికరమైన ఆదాయం రావడంతో పాటు ఆరోగ్యం కుడా వృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో రైతులకు ఇకమీదట ఎపీఏఐఎమ్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారానే ఎరువులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ భార్గవరామిరెడ్డి, జిల్లా వనరుల కేంద్రం ఏడీ స్రవంతి,వాల్మీకీపురం ఏడీఏ నాగప్రసాద్, కలికిరి కేవికే శాస్త్రవేత్త సోమశేఖర్, ఆత్మాఅధికారి అమృత్‌కుమారరెడ్డి, ఎవో రత్నమ్మ, ఎఈవో రాజేష్, ఎంపీఈవో షబానా, వీఏఏలు శోభనా, రమణ, రైతులు పాల్గొన్నారు.


