రిజిస్ట్రేషన్లు 117 స్లాట్లకు పెంపు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు 117 స్లాట్లకు పెంపు

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

మదనపల్లె: మదనపల్లె సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న స్లాట్‌ సేవల సంఖ్య పెరిగిందని స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ గురుస్వామి నాయుడు సోమవారం తెలిపారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ సంఖ్య ఇప్పటిదాకా రోజుకు 78 స్లాట్లుగా ఉండగా మంగళవారం నుంచి దీనిసంఖ్య 117కు పెంచినట్లు చెప్పారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అప్రమత్తతే

ప్రాణాలకు రక్షణ కవచం

– జిల్లా అగ్నిమాపక అధికారి

ఆదినారాయణ రెడ్డి

కురబలకోట: అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తతే ప్రాణాలకు రక్షణ కవచమని జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అంగళ్లు దగ్గరున్న విశ్వం కళాశాలలో అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి..తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాలతో ఎలా బయటపడాలో విద్యార్థులు, అధ్యాపకులకు సిబ్బంది అవగాహన కల్పించారు. ఎక్కడైనా ప్రమాదాలు ఎదురైతే వెంటనే 101 నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. మదనపల్లి అగ్ని మాపక అధికారి శివప్ప తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ సోదాలు

రాయచోటి : రాయచోటిలో సోమవారం ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ సహాయ అధికారిగా బాలాజీ పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట విధి నిర్వహణలో ఉంటూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కదిరితో పాటు రాయచోటిలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం తిరిగి సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సోదాలలో పలు భూమి రికార్డులు, బంగారు నగలు, డబ్బులు భారీగా పట్టుబడినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆయన ఇంటితోపాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

ఏఐ..ప్రపంచాన్ని శాసిస్తుంది

కురబలకోట: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఏఐ నిలవబోతోందని బెంగళూరులోని క్లౌడ్‌ సెక్‌ కంపెనీ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ జయంత్‌ శర్మ అన్నారు. అంగళ్లు మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో ఆన్‌ ఏఐ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ, మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ ధింగ్స్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ణానాలు భవిష్యత్‌ ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు సిద్దాంత జ్ఞానంతో పాటు వాస్తవ ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించే దిశగా ముందుకు సాగాలన్నారు.పరిశ్రమలకు అనుగుణంగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే ఉద్యోగావకాశాలు సాధ్యమవుతాయన్నారు.

ఘనంగా చాంద్‌ ఫిరా గుంబద్‌ దర్గా నషాన్‌

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరం రహమతుల్లా వీధిలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన చాంద్‌ ఫిరా గుంబద్‌ దర్గా నషాన్‌ ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి అమిరురన్నిసా ఇంటి నుండి గంధం కళాశాన్ని తీసుకువచ్చి దర్గాలో గంధాన్ని సమర్పించారు. అలాగే దర్గా ఆవరణంలో ఉన్న జెండా ను అలంకరించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ గంధం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా ముతవల్లి అమిరున్నిసా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌ బాష, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అమీర్‌ బాబు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement