● జిల్లా వ్యాప్తంగా
3,628 మంది దరఖాస్తు
● 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
మదనపల్లె సిటీ: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్ ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సెక్టార్‌లోను పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం,తక్కువ ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులభంగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువత పాలిటెక్నిక్ ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 21,526 .మంది పదవ తరగతి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 3,628 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25వతేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇందు కోసం మదనపల్లెలో 5, రాయచోటిలో 4, , కలికిరిలో 2 పీలేరులలో 2 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. హాల్‌టిక్కెట్లు అభ్యర్థులు డైన్‌లోడ్ చేసుకోవచ్చు.
గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం
గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాధిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తున్నాయి.
జిల్లాలో కళాశాలలు, కోర్సుల వివరాలు
పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇన్సఫర్‌మేషన్ టెక్నాలజీ(ఐటీ) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మదనపల్లె, రాయచోటి, కలికిరి, పీలేరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గోల్డన్‌వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజీ, పీలేరు ఎంజెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలలో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.
చక్కటి ఉపాధి
డిప్లోమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడటానికి పాలిటెక్నిక్ సరైన మార్గం. విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువులకు సైతం ఉపయోగపడుతుంది.
– జె.రాజేంద్రప్రసాద్, పాలిసెట్ కన్వీనర్, జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్,మదనపల్లె.


