జేసీ శివ్‌నారాయణశర్మ
మదనపల్లెఅర్బన్: ప్రజా అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణశర్మ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్‌పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. కాగా గ్రీవెన్స్‌సెల్‌లో మొత్తం 371 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, ఏడీ భరత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల వివరాలు..
● గ్రామానికి మంజూరైన పంచాయతీ భవన నిర్మాణానికి పట్టణానికి వలస వెళ్లిన చలపతి, సాంబశివ సోదరులు అడ్డుపడుతున్నారని తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామస్తులు జేసీకి అర్జీ అందజేశారు. ఈ విషయంలో ఎంపీడీవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాంతో ఆక్రమణదారులు అడ్డుపడుతున్నట్లు వివరించారు.
● స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు జేసీకి అర్జీ సమర్పించారు మధ్యా హ్న భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు.


