చంద్రగిరి : కారు ఢీకొని మోటార్ సైక్లిస్టు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం భాకరాపేట్ ఘాట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన నాగయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌లో తిరుపతికి వస్తుండగా వెనుకనే వచ్చిన కారు నాగయ్యను ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో నాగయ్య తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వస్తున్న వాహనదారులు ఇది గమనించి సమాచారం ఇవ్వడంతో భాకరాపేట 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


