సంబరాలకు డబ్బుంది.. రైతులను ఆదుకోవటానికి లేవా | - | Sakshi
Sakshi News home page

సంబరాలకు డబ్బుంది.. రైతులను ఆదుకోవటానికి లేవా

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

అమరావతి పేరుతో దోచుకుంటున్నారు

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు : రాష్ట్రంలో రైతులు పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరలు వస్తాయని అశించారు.అయితే మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు లేక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరితే తమ వద్ద డబ్బులు లేవంటూ అమరావతి పేరుతో ఊరురా సంబరాలు చేయడం కోసం ఖర్చు పెడుతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్క పొగాకు పంటలు వేసి నష్టపోయిన రైతులు చాలా మంది మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఎకరాకు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 40క్వింటాళ్ల వరకు వచ్చింది. ఈ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కింద రూ. 2400 ప్రకటించింది. అయితే ఎక్కడ కూడా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కోనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు వెళ్లి రైతులు అమ్మకాలను కొనసాగిస్తుంటే వారు క్వింటాకు కేవలం 1700 రూపాయలు చెప్పి తరుగులు తీయడంతో క్వింటాకు రైతులకు 1600 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. శనగ పంటను రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు సాగుచేశారు.ఈ ఏడాది ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.5875 ప్రకటించింది.అయితే శనగ కొనుగోలు కేంద్రాల్లో శనగలు కొనుగోలు చేయడంలేదు. కొనుగోలు చేస్తున్నా కాంట్రాక్టర్లు చిలక్కొట్టుడు కొడుతుండటంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్‌లో వ్యాపారుల వద్ద రూ. 4900కే శనగలు అమ్ముకుంటున్నారు. శనగ రైతు ప్రతి క్వింటాకు 900 నుంచి 1000 నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకోసం కేంద్రానికి లేఖలు పంపామని, ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు రూపాయలు దొచుకోవడం కోసం ఆగమేఘాలమీద అమరావతి బిల్లును కేంద్రానికి పంపించి, రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక చట్టం తెచ్చామని కూటమి నాయకులు చెబుతున్నారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో ఎందుకు లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో 3.56 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టారా అంటే ఆదీలేదు అని అన్నారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు ఇన్సూరెన్స్‌లు ఇచ్చి రైతులను ఆదుకుందని తెలిపారు.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి రమణారెడ్డి, రైతు విభాగ నాయకుడు విశ్వనాథ్‌రెడ్డి, జిల్లా మున్సిపల్‌ విభాగ అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement