మదనపల్లెటౌన్ : జల్సాలకు అలవాటుపడి బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ కుప్పం మల్లికార్జున(40) రాయలసీమ జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారాడు. ఇతనికోసం గాలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.61 లక్షల విలువైన పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పావనితో కలిసి మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు.
బస్టాండ్లు, ఆసుపత్రులే లక్ష్యం
జల్సాలు, పేకాట వ్యసనాలకు బానిసైన మల్లికార్జున సులువుగా డబ్బు సంపాదించాలని 2022 నుంచి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్నాడు. ఆర్టీసీ బస్టాండ్లు, ఆసుపత్రులు, సచివాలయాల వద్ద నిలిపి ఉంచిన బైక్‌ల తాళాలు విరగ్గొట్టి దొంగలించాక వాటిని లక్కిరెడ్డిపల్లె పరిసరాల్లో దాచి, ఆ తర్వాత మదనపల్లెలోని వైఎస్సార్ కాలనీ, బైపాస్‌రోడ్డులోని పాడుబడిన గదిలో పెట్టాక బెంగళూరులో అమ్మేందుకు ప్రణాళిక వేస్తుండగా మల్లికార్జున పోలీసులకు చిక్కాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక చౌడేశ్వరి గుడివద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న మల్లికార్జున పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. తర్వాత నిందితున్ని విచారించి అతని వద్ద ఉన్న బైక్‌తో పాటు, దాచిన తొమ్మిది బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మదనపల్లె టూటౌన్, మదనపల్లె రూరల్, పుంగనూరు, తిరుపతి ఈస్ట్, కదిరి టౌన్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన బైక్‌లుగా గుర్తించినట్టు చెప్పారు. నిందితున్ని అరెస్ట్ చేయడంలో డీఎస్పీ బి.పావని పర్యవేక్షణలో టూటౌన్ సీఐ ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్‌ఐ వి. నాగేశ్వరరావు కృషి చేశారని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రఫీ, ఎస్‌ఐ నాగేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రశంసించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలనఎం.వెంకటాద్రి, డిఎస్పీ బి.పావని, 2 వ పట్టణ సీఐ. ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్బి సీఐ పి.రాజా రమేష్, 2 వ పట్టణ ఎస్‌ఐ లు వి.నాగేశ్వర రావు, బి .రామాంజనేయులు పాల్గొన్నారు.
నిందితుడు అరెస్ట్, పది బైక్‌లు స్వాధీనం


