కడప కార్పొరేషన్ : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 9వ తేదీ వైఎస్సార్‌సీపీ నాయకులు గుంటి నాగేంద్ర, డాక్టర్ నాగార్జునరెడ్డిలు చేసిన నిరసనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం వారు విచారణకు హాజరయ్యారు. కొత్త పలుకు అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చెబితే వారు తమ భార్యలను చెల్లెళ్లుగా భావించి ఇతరులకు సంబంధాలు చూసి పెళ్లి చేసే వెన్నెముక లేనివారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు ఎన్. నాగార్జునరెడ్డి తదితరులు ఈనెల 9వ తేదీ రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆ పత్రిక బ్రాంచి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు ఈనెల 17వ తేదీ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో సోమవారం వారు పోలీసుల ఎదుట హాజరయ్యారు. కేసులో నమోదు చేసినవన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావడంతో పోలీసులు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వారి వెంట వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, చల్లా పవన్, సతీష్ తదితరులు ఉన్నారు.


