మదనపల్లె టౌన్ : రైతులకు ఓ వ్యాపారి లక్షల్లో మోసం చేయడంతో మోసపోయామని తమకు న్యాయం చేయమని కోరుతూ సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కష్టపడి పండించిన పంటకు రావాల్సిన సుమారు రూ. 14.61లక్షల బకాయిలు చెల్లించ కుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. పెద్దతిప్పసముద్రం మండలం, రాపూరివారిపల్లికి చెందిన రైతు పి.శ్రీనివాసులు రెడ్డి, పి.ఆది నారాయణ రెడ్డి, పి.అర్జున్ రెడ్డి, శీనా, మురళి, పి.సహదేవరెడ్డి, టి.భాస్కర, టి.కుబేర మొక్కజొన్న సాగుచేసిన దిగుబడిని విజయవాడకు చెందిన పి.నవీద్ ఖాన్ గత డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా కొనుగోలు చేశారన్నారు. మొత్తం రూ 25,61,755ల విలువ చేసే మొక్కజొన్న కొనుగోలు చేసిన పి.నవీద్ ఖాన్ రూ.11 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన రూ.14,61,755 లను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పారు. తిరిగి తమనే బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులవద్ద ప్రభుత్వం పంట కొనుగోలు చెయ్యక పోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.


