నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ జలధార నోడల్‌ అధికారిగా కలెక్టర్‌ 22న బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు సేవా కార్యక్రమాల్లో ట్రస్ట్‌

మదనపల్లె: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లాకు చెందిన వినియోగదారులు 9440817449 నంబర్‌కు ఫోన్‌చేసి విద్యుత్‌ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మదనపల్లె: ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టం) కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై వాటి నమోదు, వాటి తాజాస్థితిపై సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. మండల, డివిజన్‌ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని కోరారు.

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

మదనపల్లె: జలధార–జలహారతి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన జలధార కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను నోడల్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ జలధార కార్యక్రమానికి మండల, పట్టణాల నోడల్‌ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. నీటి సంరక్షణ–నీటి భద్రత విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని కోరారు. భారీ వర్షాలు పడినా నీటి ముంపు లేకుండా ఉండేలా కాల్వలను, చెరువుల మరమ్మతులు చేయించాలని,వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నగరంలోని జయనగర్‌ కాలనీ జడ్పీ గర్‌ల్స్‌ హై స్కూల్‌లో ఈ నెల 22న జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా స్దాయికి ఎంపికై న క్రీడాకారులు మే 1 నుంచి 4 వరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.

నందలూరు: శ్రీ సౌమ్యనాధ సేవా ట్రస్ట్‌ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైందని ట్రస్ట్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ యద్దల సుబ్బరాయుడు తెలిపారు. ట్రస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 2026 సంవత్సరం మార్చి 31వ తేదీకి వివిధ బ్యాంకుల్లో రూ.2,51,38,720 చేరుకున్నాయని పేర్కొన్నారు. ఆదివారం సేవ ట్రస్ట్‌ లో ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ 2025– 26 మార్చి నాటికి అన్నదాన పథకానికి అయిన జమా ఖర్చులు పరిశీలించామని తెలిపారు. ఈ వేసవి కాలంలో మంచినీటి వసతి భక్తులకు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, కార్యదర్శి కె.శైలేంద్రనాథ్‌, గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య, సర్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement