● హార్సిలీ హిల్స్‌లో చల్లదనం మాయం!
● 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
● కొండకు వచ్చేందుకు భయపడుతున్న పర్యాటకులు
బి.కొత్తకోట : రాష్ట్రంలో ఏకై క వేసవి విడిది కేంద్రం బి కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్. మండుటెండలో అత్యంత చల్లగా, హాయిగొలిపే హార్సిలీ హిల్స్ అంటే అందరికీ ఇష్టం. ఇక్కడ సేద తీరేందుకు, చల్లటి వాతావరణ అనుభూతి పొందేందుకు సామాన్యుల నుంచి ధనికుల వరకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం ఇది నిప్పుల కొండగా మారిపోయింది. ఇక్కడికి రావాలంటేనే పర్యాటకులు భయపడే పరిస్థితి వచ్చేసింది. చల్లని కొండపై ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగి మండిపోతోంది.
37 డిగ్రీల ఉష్ణోగ్రత
హార్సిలీహిల్స్ పై సాధారణంగా ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి. వేసవిలో అయితే 15 నుంచి 24 డిగ్రీల దాకా పెరుగుతాయి. 30 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిన సందర్భాలు అరుదు. అయితే కొన్నేళ్లుగా ఇక్కడి వాతావరణ సమతుల్యత దెబ్బతింది. పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ఫలితంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతూ పోతున్నాయి. శని,ఆదివారాల్లో ఎన్నడూ లేనంతగా 37 డిగ్రీలకు పెరిగింది. ఈ ఉష్ణోగ్రత సాధారణ మైదాన ప్రాంతంలోనే ఉంటోంది. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్ పైన ఇదే ఉష్ణోగ్రత ఉంటే ఇక తేడా ఏముందని పర్యాటకులు చెబుతున్నారు. మంగళవారం ఇదే కొండపై ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదైంది. మూడు రోజుల తేడాలో మూడు డిగ్రీలు పెరిగి 37కు చేరుకుంది.
ఎడాపెడా నిర్మాణాలు
ఇప్పుడున్న హార్సిలీహిల్స్ నివాస ప్రాంతం ఒకప్పుడు రిజర్వ్ ఫారెస్ట్. 103 ఎకరాలను అటవీశాఖ రెవెన్యూ శాఖకు బదలాయించింది. 20 ఏళ్ల కాలంలో పర్యావరణం దెబ్బతినే విధంగా కాంక్రీట్ నిర్మాణాలు ఎడాపెడా కొనసాగుతున్నాయి. అవి ప్రభుత్వ శాఖల నిర్మాణాలే కాక, అత్యధికంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అందులో వాణిజ్య కార్యకలాపాలు విసృతంగా సాగుతున్నాయి. పదేళ్ల క్రితం శాటిలైట్ చిత్రాలు, ఇప్పటి శాటిలైట్ చిత్రాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే కొండపై అక్రమ నిర్మాణాలు ఎంత భారీ స్థాయిలో జరిగాయో నిర్ధారణ అవుతుంది. మరోవైపు ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ వినియోగం, వాటిని ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమల ఉత్పత్తికి కారణమవుతోంది. ఇలాంటి కారణాలతో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా హార్సిలీహిల్స్‌కు ఉన్న పేరు చెదిరిపోతోంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయి సందర్శకుల రాక పూర్తిగా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు.
మారిన పరిస్థితులు
హార్సిలీహిల్స్‌పై నడుస్తుంటే మేఘాలు తాకి పలకరించేవి. చల్లటి గాలులు వీచేవి. ఎంతటి వేసవి అయినా ఉష్ణోగ్రత ఉండేది కాదు, ఎండ అనిపించేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. మేఘాలు కొండను తాకడం లేదు. చల్లటి గాలులు వీయడం లేదు. ఉక్కపోత, వేడి పర్యాటకులను చెమటలు తెప్పిస్తున్నాయి. దీంతోపాటు దోమలు అధికమయ్యాయి. పర్యావరణం దెబ్బతినిందనేందుకు ఇదే ఉదాహరణ. ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. కేవలం హార్సిలీహిల్స్ అన్న పేరు మినహాయిస్తే సాధారణ ప్రాంతానికి కొండపై ఉన్న ప్రాంతానికి తేడా లేకుండా పోయింది. ఫలితంగా సందర్శకులు ఇక్కడికి రావాలంటే ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు వస్తున్న సందర్శకులు అత్యధికులు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారే.


