అనుమానం పెనూభూతమై | - | Sakshi
Sakshi News home page

అనుమానం పెనూభూతమై

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

వాల్మీకిపురం : భార్యపై అనుమానంతో భర్తే కాలయముడయ్యాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో భార్య మౌనిక (27) అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వాల్మీకిపురం పట్టణం తోటవీధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. తోటవీధికి చెందిన జగదీష్‌ తన భార్య మౌనికపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఆదివారం తిరిగి సొంతూరైన వాల్మీకిపురం వచ్చారు. వచ్చిన గంట వ్యవధిలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో కోపంతో ఊగిపోయిన జగదీష్‌ మౌనికపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడిక్కడే మృతి చెందింది. భార్య మృతి చెందిన విషయాన్ని గమనించిన జగదీష్‌ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సీఐ రాఘవ రెడ్డి, ఎస్‌ఐ తిప్పేస్వామి సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మౌనికకు కుమారుడు కౌసిక్‌(7), కుమార్తె లోక్షిత (5) ఉన్నారు.

బలిజలు ఐక్యతతో ముందుకు సాగాలి

వాల్మీకిపురం : బలిజలందరూ ఐక్యతతో కలసి ముందుకు సాగాలని జాతీయ కాపు సంఘం ప్రచార కార్యదర్శి గోపి రాయల్‌ అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మన హక్కులను మనమే సాధించుకోవాలన్నారు. చట్ట సభల్లో బలిజలకు రిజర్వేషన్‌ కల్పించి, కాపు కార్పొరేషన్‌లో నిధులు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోసూరి చంద్రమౌళి, శ్రీధర్‌రాయల్‌, రామచంద్ర, మోహన్‌రామ్‌, సుబ్రమణ్యం, పివి నారాయణ, బొక్కసం ఆనంద, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

30న అన్నమయ్య కీర్తనలపై పోటీలు

కడప సెవెన్‌రోడ్స్‌ : తెలుగు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి మే 2వ తేది కడప నగరం హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్నామని ఆలయ సేవా సమితి అధ్యక్షులు దేసు వెంకటరెడ్డి తెలిపారు. ఈ నేపధ్యంలో ఈనెల 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ కోదండ రామాలయంలో అన్నమాచార్య కీర్తనలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు ఈనెల 28వ తేదీ రాత్రి 7 గంటల్లోపు 94407 25110 లేదా 80960 34302 నంబర్లకు ఫోన్‌ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 2వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకుని మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుందన్నారు. 10.30 గంటలకు శ్రీ అన్నమాచార్యుల సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంకీర్తన పోటీలో విజేతలైన వారికి బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు.

యువకునిపై కత్తితో దాడి

చింతకొమ్మదిన్నె : కొలుములపల్లె పంచాయతీలోని మద్దిమడుగు గ్రామ సమీపంలో గల వ్యవసాయ బావి వద్ద సయ్యద్‌ ఇమ్రాన్‌ అనే యువకుడిపై కత్తితో దాడి చేయడంతో గాయపడినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులుగా సయ్యద్‌ దాదాపీర్‌, దస్తగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి రిమ్స్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భర్త చేతిలో భార్య హత్య

Advertisement
 
Advertisement
Advertisement