● గోపాలపురంలో తీరని వేదన
● తండ్రి, బిడ్డకు అంత్యక్రియలు
కురబలకోట : కురబలకోట మండలం అంగళ్లు గ్రామం గోపాలపురానికి (కొండకింద) చెందిన గాండ్లపెంట రెడ్డి ప్రసాద్‌రెడ్డి (33) అతని నాలుగు నెలల కుమార్తె ప్రియాన్సిత ఆకస్మిక మృతి పలువురిని కలచి వేస్తోంది. నిష్కారణంగా ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. శనివారం రాత్రి అమ్మ చెరువు మిట్ట వద్ద బైక్‌పై వస్తున్న వీరిని భారీ లారీ ఢీకొన్న సంఘటనలో వీరిద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరితో పాటు బైక్ వెనుక కూర్చున్న రెడ్డి ప్రసాద్ రెడ్డి భార్య జ్యోతి (30) తీవ్ర గాయాలకు గురై ప్రాణాలతో బయటపడ్డారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రియాన్సితను మదనపల్లె ఆసుపత్రిలో చూపించి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్గటన జరిగింది. రెడ్డి ప్రసాద్ రెడ్డి ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం. తల్లి సరస్వతమ్మ వృద్ధురాలు. తండ్రి ఇతను చిన్నప్పుడే చనిపోయారు. రెడ్డి ప్రసాద్‌ఽ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు. అంగళ్లులోని రాయచోటి రోడ్డులో పైపుల షాపు నిర్వహిహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లారీ రూపంలో మృత్యువు ఇతన్ని కబలించింది. ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామం గోపాలపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. ముక్కుపచ్చలారని చిన్నారిని చూసి చెమ్మగిల్లని కన్నులు లేవు. కాగా ఈ ప్రమాదానికి కారకులెవరు అనేది వెంటాడుతోంది. ముదివేడు పోలీసులు అమ్మ చెరువు మిట్ట వద్ద ప్రమాదాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ మెల్లగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే శనివారం రాత్రి వచ్చిన భారీ లారీ ముందున్న బారికేడ్లును దూరం నుంచి డ్రైవర్ గమనించాడు. నిదానంగా వెళ్లాలన్న కారణంగా లారీని పక్కకు తిప్పాడు. అదే సమయంలో భార్యా బిడ్డలతో రోడ్డు పక్కగా వెళుతున్న రెడ్డి ప్రసాద్ రెడ్డి బైక్‌ను లారీ వేగంగా డీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత చిన్నారి ప్రియాన్సిత మృతి చెందింది. భార్య జ్యోతి వెనుక కూర్చుని ఉన్నప్పటికీ లారీ ఢీకొన్నప్పుడు రోడ్డు పక్కకు పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె కోటుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. సంఘటన స్థలం డౌన్ కాబట్టి లారీ డ్రైవర్ వేగంగా ఆపై నిర్లక్ష్యంగా తోలడమా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం ఈ ప్రమాదానికి కారణమా..ఈ పాపం ఎవరిదన్న ప్రశ్న పలువురిని వెంటాడుతోంది. ఇంటి ముందు కూర్చొని కన్నీరు పెట్టుకున్న వృద్ధ తల్లి, ఒకే సారి భర్త బిడ్డను కోల్పోయి విషాదంలో మునిగిపోయిన జ్యోతి.. ఈ దృశ్యాలను చూసిన వారు చలించిపోతున్నారు. ఇదివరకు ఇదే తరహాలో సీటీఎంకు చెందిన రియల్టర్ కూడా ఇక్కడ చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు.


