మదనపల్లె టౌన్ : ఆటో డ్రైవర్‌ను తిట్టాడన్న కోపంతోనే దివ్యాంగుడైన శంకర్‌ను ఆటోడ్రైవర్లు హత్య చేశారని డీఎస్పీ పావని వెల్లడించారు. మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45)ను హత్య చేసిన నిందితుల అరెస్టు వివరాలను స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురయ్యాడని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 11న రాత్రి శంకర్ ఎస్టేట్ వద్దకు ఓ పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చేందుకు ఆటోలో ఎక్కాడు. ఆ సమయంలో బాడుగ రెట్టింపు అడగడంతో తాను దివ్యంగుడునని ఇచ్చేది రూ.వంద అని వారితో గొడవపడి తిట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ అతనితో పాటు ఉన్న మరో యువకుడు కలసి దివ్యాంగుడైన శంకర్‌ను తట్టివారిపల్లి చెరువు కట్టపైకి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి నీటితోటిలో పడేసి హత్య చేశారు. మరుసటి రోజు హత్య విషయం వెలుగులోకి రావడంతో సీఐ కళా వెంకటరమణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేశారని చెప్పారు. ఆరోజు రాత్రి శంకర్‌ను ఎస్టేట్ వద్ద ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ఇసుకనూతిపల్లి వేణుగోపాలస్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం అరెస్ట్ చేసి విచారించారు. శంకర్‌ను హత్య చేసింది తామేనని అంగీకరించారని, ఆటో ఎక్కి తమతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్య చేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు.
హత్య కేసులో ఇద్దరు ఆటోడ్రైవర్లు అరెస్ట్


