క్రీడా శిక్షణ.. భవితకు నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిక్షణ.. భవితకు నిచ్చెన

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు

ఈ నెల 26 నుంచి ప్రారంభం

ఉత్తర్వులు జారీ చేసిన శాప్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల పునః ప్రారంభానికి రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ(శాప్‌) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో స్పోర్ట్స్‌ అకాడమీలు తిరిగి ప్రారంభించనుంది. 2026 –27 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 26 నుంచి మే 6 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలను చేపట్టనుంది. ఈ మూడు అకాడమీల్లో మొత్తం 12 క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. వాటిలో అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్‌, హాకీ, ఖోఖో, జూడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌ విభాగాల్లో ఎంపికై న బాల బాలికలకు శిక్షణ అందనుంది.

ఆరు విభాగాల్లో..

తిరుపతి క్రీడా అకాడమీలో అత్యధికంగా ఆరు విభాగాల్లో (జూడో, బ్యాడ్మింటన్‌, రైఫిల్‌ షూటింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, లాన్‌ టెన్నిస్‌) రెసిడెన్షియల్‌ కోచింగ్‌ బాలురు బాలికలకు వేరువేరుగా ఇవ్వనున్నారు. జూడో, బ్యాడ్మింటన్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌ ఒక్కో విభాగం నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను తీసుకోనున్నారు. బాక్సింగ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఒక్కో విభాగం నుంచి 15 మంది బాలురకు శిక్షణ అందించనున్నారు.

మూడు క్రీడాంశాల్లో...

విశాఖపట్నంలోని స్పోర్ట్స్‌ అకాడమీలో మూడు క్రీడాంశాల(అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ ,సైక్లింగ్‌)లో బాలురకు రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో క్రీడ నుంచి 15 మంది బాలురను ఎంపిక చేయనున్నారు. మే 4న అథ్లెటిక్స్‌, మే 5న సైక్లింగ్‌, మే 6న వాటర్‌ స్పోర్ట్స్‌ విభాగాలకు సంబంధించి విశాఖపట్నం కొమ్మాదిలో ఎంపికలు చేపట్టనున్నారు. బాలికలకు మాత్రమే...

కాకినాడలోని క్రీడా అకాడమీలో బాలికలకు మాత్రమే నాలుగు క్రీడాంశాల (వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో)లో రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 29న వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌ 30న హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు కాకినాడ డీఎస్‌ఏ లో ఎంపికలు చేపట్టనున్నారు.

అర్హతలివే...

● దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులు.

● క్రీడాకారులు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారై ఉండాలి.

● జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, చదువుతున్న పాఠశాల/ కళాశాల నుంచి సర్టిఫికెట్‌ క్రీడా ప్రతిభ సర్టిఫికెట్‌ (రాష్ట్ర స్థాయి/ జాతీయ స్థాయి ఉంటే) మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, 10 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకెళ్లాలి.

● ఎంపికల సమయంలో క్రీడా దుస్తులు, కిట్టు తప్పనిసరి.

● ఎంపికై న వారికి షాప్‌ క్రీడా అకాడమీలో వసతి భోజనం, శిక్షణ సౌకర్యాలు అందించనున్నారు.

● అర్హత గల క్రీడాకారులు స్పోర్ట్స్‌ ఏపీ.జిఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement