– 11 మందిపై కేసు నమోదు
పుంగనూరు : జగనన్న కాలనీ, టిడ్కో గృహాల వద్ద మంచినీటి సమస్య, పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వాన్నంగా ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా నీటి కోసం రెండు కుటుంబాల వారు ఘర్షణ పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గూడూరుపల్లె సమీపంలో జగనన్న కాలనీలో సుమారు 700 కుటుంబాలు నివాసం ఉన్నాయి. దీని పక్కనే ఉన్న టిడ్కో గృహాల్లో 1136 కుటుంబాలు నివాసం ఉన్నారు. వీరికి సరిపడ మంచినీరు సరఫరా చేయడంలో అధికారులు గత ఆరు నెలలుగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. కానీ మార్పు రాలేదు. ఇలా ఉండగా మంచినీటి కోసం ముబారక్, నజియ కుటుంబం వారు మురళీకృష్ణ, లావణ్యతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ గాలివాన లాగా తీవ్రమైంది. ముబారక్, నజియ కలసి తమకు అనుకూలమైన బయటి వ్యక్తులను పిలిపించి మురళీకృష్ణ, లావణ్య కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముబారక్, నజియతోపాటు మరో 9 మందిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి, జగనన్న కాలనీ, టిడ్కో గృహాలకు సరిపడ మంచినీరు అందిస్తారా... లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
రోడ్డుపై మందుబాబు హల్‌చల్
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో ఓ మందు బాబు శుక్రవారం రోడ్డుపై హల్‌చల్ చేశాడు. స్థానిక రవి సినిమా థియోటర్‌కు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాదు.. పొరపాటున ఎవరైనా మందు బాబును చూడకుండా వాహనాలను ఏమరపాటుగా నడిపితే, ఆ వాహనం కింద పడి అతడు తన ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తిని తప్పించడానికి పలువురు ప్రయత్నించినా, మందుబాబు వినలేదు. దీంతో అటుగా వచ్చిపోయే వాహనదారులు కొంత సేపు అపసోపాలు పడ్డారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
– త్రుటిలో తప్పిన ప్రమాదం
మదనపల్లె టౌన్ : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. మదనపల్లె వన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూ మాదిరిగానే రామసముద్రం రోడ్డులో రోజుకు ఆరు సార్లు మదనపల్లె – రామసముద్రానికి తిరుగుతుంది. ఈ క్రమంలో నైట్ హాల్ట్ చెంబకూరులో ఉండి శుక్రవారం వేకువజామున 5 గంటలకు మదనపల్లెకు బయలుదేరింది. మార్గంమధ్యలోని మదనపల్లె మండలం పెంచుపాడు సమీపంలోని రెక్కమాను వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో త్రుటిలో ప్రాణా పాయం తప్పిందని స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన వార్త తెలియగానే ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో బస్‌ను వెలికితీసి డిపోకు తరలించారు.


