ఉపాధి పథకంతో వలసలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పథకంతో వలసలు నివారించాలి

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

మదనపల్లె: ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను నివారించడంతోపాటు ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ సంఘం జిల్లా మొదటి మహాసభలు మదనపల్లెలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభకు మండం సుధీర్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. దేశంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలు వ్యవసాయ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారని, వీరంతా భూమిలేని నిరుపేదలేనని అన్నారు. 20 ఏళ్లుగా వ్యవసాయ కూలీలకు ఆసరాగా, భరోసాగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పాత పద్ధతుల్లోని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వి బీ జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమలవుతున్నప్పటికీ దేశంలో భూస్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, పాలకవర్గాలే భూస్వాములుగా ఉన్నారన్నారు. వెంటనే ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచి మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని అన్నారు. మహాసభలకు సిఐటియు జిల్లా అధ్యక్షులు హరి శర్మ సంఘీభావం ప్రకటించి, మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు తమ మద్దతు సహాయ సహకారాలు నిరంతరం ఉంటాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా మొదటి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement