పోలీసుశాఖ క్రమశిక్షణకు నిదర్శనం. పోలీసు, రైటర్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ, ఏఏస్పీ, ఎస్పీ ఇలా అంచెలంచెలుగా ఒకరిపై ఒకరు గౌరవభావంతో వారి ఆదేశాలను అమలు పరుస్తూ శాంతిభద్రతలు పరిరక్షణలో నిమగ్నమయ్యేవారు. విధులపై నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదా వైఫల్యం చెందడం ఈక్రమంలో ఎస్పీ సీరియస్ అయితే తప్పా, సీఐలకు ట్రాన్సుఫర్లు వచ్చేవి కావు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నేరుగా రేంజ్ అధికారులు పోస్టింగ్స్ ఇస్తుండడం, ఆ పోస్టింగ్స్ కూడా నిలకడగా లేకపోవడంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ లోపించింది. ఎస్పీతో నిమిత్తం లేకుండా నేరుగా డీఐజీ స్థాయి అధికారితో సత్సంబంధాలుంటే చాలు అనే దిశగా సీఐలు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే శాంతిభద్రతల డొల్లతనం తెరపైకి వస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆస్తి, మాన, ప్రాణాల రక్షణ కోసం పనిచేసేందుకు అనువుగా బదిలీలు చేస్తూ పోలీసు అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


