రాయలసీమను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

రాయలసీమను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

కడప కార్పొరేషన్‌: చంద్రబాబు సర్కార్‌ రాయలసీమను తడిగుడ్డతో గొంతు కోసేందుకు సిద్ధపడిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంత మంది రాయలసీమ ద్రోహులు అవగాహన లేకుండా తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమకు వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ ఏమీ చేయలేదని పయ్యావుల కేశవ్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిలాంటి వారు మాట్లాడటం దారుణమన్నారు. వారు బుద్ధిఉండే మాట్లాడుతున్నారా లేక ఈ ప్రాంత వాసులను గొంతు కోసేందుకు సిద్ధపడ్డారా అనిపిస్తోందన్నారు.

సీమలోని ప్రతి ప్రాజెక్టు వైఎస్సార్‌ పుణ్యమే

రాయలసీమలో ఉన్న ప్రతిఒక్క ప్రాజెక్టు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పుణ్యమే అని అన్నారు. పోతిరెడ్డిపాడు, గాలేరు– నగరి, హంద్రీ– నీవా, వెలిగల్లు ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్‌ నిర్మించారని గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వైఎస్సార్‌ స్ఫురణకు వస్తారని, భవిష్యత్‌ తరాలు ఆయన్ను చిరకాలం గుర్తుంచుకుంటాయన్నారు. ఎన్టీఆర్‌ ఆ ప్రాజెక్టులకు పేరన్నా పెట్టాడు కానీ...పార్టీ లాక్కున్న చంద్రబాబు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు కడితే భవిష్యత్‌లో అవి గుదిబండగా మారుతాయని చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన వందిమాగదులతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబేనన్నారు. వీళ్లకు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. 1995–2004 వరకు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏ ప్రాజెక్టులోనూ తట్టెడు మట్టి తీయకుండా రాయలసీమ గొంతుకోశారన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే నికరజాలాలు వచ్చేవన్నారు. 20 టీఎంసీల సామర్థ్యమున్న గండికోటను 3 టీఎంసీలు చాలు అన్న ఘనుడు చంద్రబాబు అన్నారు. వైయస్సార్‌ సీఎం అయ్యాక మిగులు జలాలతో ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి, ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. వెలిగల్లును ఏడాదిలోనే పూర్తి చేశారన్నారు. గండికోటలో 27 టీఎంసీలు నిల్వ ఉంచిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ లిఫ్ట్‌ చేపడితే... తన వ్యాపారాల కోసం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సీమలోని రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్ళు ఉన్నాయంటే అది వైఎస్‌ఆర్‌, వైఎస్‌ జగన్‌ల వల్లేనని తెలిపారు. సీమ ప్రాజెక్టులకు 42వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారని, ఏ ప్రాజెక్టుకు ఎంతెంత ఖర్చు చేస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించలేని మీరు 42 వేల కోట్లు ఖర్చు చేస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు. రాయలసీమకు మీరు గతంలో ఏం చేశారు...ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కర్నూలుకు వచ్చిన హై కోర్టు, లా యూనివర్సిటీ అన్నీ తరలించారని, అనంతపురంలోని ఎయిమ్స్‌ను, కొప్పర్తిలోని టెక్నాలజీ సెంటర్‌ను, అమరావతికి తరలించారన్నారు. రాయలసీమకు ఏమీ చేయకుండా అమరావతి పేరుతో తెచ్చే అప్పులను తమపై రుద్దుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌ను అభివృద్ధి చేయమంటే వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసి మాట్లాడాలన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌ ను ఏడాదిలోగా పూర్తి చేయకపోతే..ఉద్యమం ఎలా ఉంటుందో రుచిచూస్తారని హెచ్చరించారు. హై కోర్టు, లా యూనివర్సిటీ కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. చైన్నెకి తాగునీరు ఇవ్వడానికే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం చేపట్టారని మాట్లాడటం అవగాహన రాహిత్యమన్నారు. అలాగైతే తెలుగు గంగ కూడా అందుకోసమే చేపట్టారని, వాటి వల్ల ఈ ప్రాంతానికి జరిగే ఉపయోగాలను తెలుసుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు టీడీపీ నేతలు రాజీనామా చేసి రాయలసీమ లిఫ్ట్‌ ఉద్యమంలోకి రావాలని కోరారు. చంద్రబాబు సీమలోనే కాదు...అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేశాడన్నారు. సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి శివప్రసాద్‌, షఫీ, సీహెచ్‌ వినోద్‌ కుమార్‌, బాలస్వామిరెడ్డి, మియ్యా, ఫయాజ్‌, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement