మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా పని చేస్తున్న పీకేఎం ఉడా కార్యాలయ పరిపాలనా అధికారిగా వి.చిట్టిబాబు నియమితులయ్యారు. గురువారం ప్రభుత్వం చేసిన బదిలీల్లో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చిట్టిబాబును ఇక్కడికి బదిలీ చేశారు.
మదనపల్లె సిటీ: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. 75 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తమ శ్రేణిలో పాసయ్యారు. గురువారం విద్యాలయంలో పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ ఎం.గీత తెలియజేశారు. బండి ప్రవీణ్‌కుమార్ 500 మార్కులకు 485 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. కె.కెం.జిజ్ఞాస్, ఈ.తేజశ్రీలు 475, మోక్షితగౌడ్ 472 మార్కులు, గురుగోవర్ధన్ 471 మార్కులు సాధించారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ శ్రీవిద్య, సీనియర్ టీచర్లు అభినందించారు.
పీలేరురూరల్: జిల్లాకు నూతనంగా 43 బస్సు లు రానున్నట్లు కడప ఆర్టీసీ ఈడీ ఎస్.టి.పి. రాఘవకుమార్ అన్నారు. గురువారం పీలేరు ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు డిపోకు కూడా 8 కొత్త సర్వీసులు వస్తున్నట్లు తెలిపారు. పీలేరు బస్టాండ్ పరిధిలో రూ. 32 లక్షలతో చేపట్టిన నూతన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే రూ. 8.5 లక్షలతో డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ డిపో పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను బాడుగకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో మొక్క లు నాటారు. ఆర్‌ఎం పి. రాము, డీఎం ఎస్‌ఎండి రోషన్, ఈఈ పోతురాజు, సీఐ పాల్గొన్నారు.
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): ప్రభుత్వాస్పత్రి లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో కాన్పుల గది, మందులు, మాత్రలు ఇచ్చే గదులను పరిశీలించారు. అలాగే ల్యాబోలేటరి, రోగులకు ఏర్పాటు చేసిన మంచాలను పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూశారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ మండలంలోని నలుమూలల నుంచి వచ్చే గర్భిణీలకు ఇక్కడే ప్రసవాలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వడదెబ్బ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట డాక్టర్‌తో పాటు, వైద్య సిబ్బంది ఉన్నారు.


