కలికిరి: కలికిరి సమీపంలోని మదనపల్లె– తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద రెండు రోజులుగా జరిగిన రాయచోటి జిలేకా మైదానీ ఇజ్తెమా గురువారం రాత్రి దువా ప్రార్థనలతో ముగిసింది. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులు ఇజ్తెమా ప్రాంగణానికి తరలివచ్చారు. ఫజర్ నమాత్ తర్వాత ముస్లిం ఆధ్మాత్మిక వేత్తలు, మత గురువులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసంగాలు కొనసాగించారు. ధార్మిక సభా ప్రాంగణం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర ఖురాన్‌లోని అంశాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని అన్నారు. దైవ ప్రార్ధనలతో మానవ జన్మకు సార్ధకత చేకూరేలా నడుచుకోవాలని, ప్రతి నిత్యం అల్తాహ్‌ను ప్రార్థించాలని సూచించారు. ఇజ్తెమా ముగింపు నేపథ్యంలో చివరగా మత గురువులు చేసిన దువా ద్వారా భక్తులు పాపాలను క్షమించాలని వేడుకున్నారు. ఇజ్తెమాకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ముస్లింలు గురువారం సాయంత్రం నుంచి గమ్య స్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు, వలంటీర్లు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లును చేపట్టారు.


