సాక్షి టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా పీలేరులో రెండు నెలల క్రితం టీడీపీ నాయకులు పట్టపగలు ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచిన కేసులో నిందితులను ఈ నెల 29వ తేదీలోపు అరెస్ట్ చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 14న పీలేరు పట్టణానికి చెందిన ఎస్. బోదేషావలి (50) కుమారుడు ఎస్. జాకీర్ హుస్సేన్ (32) శనివారం తమ కుటుంబానికి స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని సర్వే నెంబరు 1/4లో ఉన్న భూమి వద్దకు వెళ్లాడు. వారికి చెందిన 1.20 ఎకరాల భూమిలో టీడీపీ నాయకుడు మౌలా, అతని అనుచరులు ప్లాట్లు వేసి విక్రయిస్తాన్నారని ప్రశ్నించాడు. భూ వివాదంలో ఇరువర్గాల వారు ఘర్షణపడ్డారు. ఈ సందర్భంగా మాలా అనచరులు జాకీర్ హుస్సేన్‌పై దాడి చేశారు. దీంతో జాకీర్‌హుస్సేన్ టోల్‌ఫ్రీ నంబర్ 112కు కాల్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను వేరుచేశారు. దాడిలో గాయపడిన జాకీర్ హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా కోరాడు. అయితే పోలీస్ అధికారులు ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేపించుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు తన తండ్రి బోదేషావలి, భావమరిది ఎస్. సయ్యద్ బాషా (29)తో కలసి ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అడ్డగించి బోదేషావలి, సయ్యద్‌బాషాపై నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ముగ్గురు చికిత్సమిత్తం స్థానికి ప్రభుత్వాస్పత్రికి చేరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు...
తమపై హత్యాయత్నం జరిగితే పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారని తమకు న్యాయం చేయా లని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు పరిశీలించిన కోర్టు నిందితులపై తక్షణ చర్యలు తీసుకుని ఈ నెల 29 లోపు కోర్టుకు సమాధానం చెప్పాలని పీలేరు పోలీసులను ఆదేశించింది.


