రగులుతున్న తమ్ముళ్లు! | - | Sakshi
Sakshi News home page

రగులుతున్న తమ్ముళ్లు!

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

రగులుతున్న తమ్ముళ్లు!

మైనార్టీలకు మొండిచేయి

మదనపల్లెలో ఆగ్రహావేశాలు

మదనపల్లె: టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలకు ఎంపిక చేసిన నేతల జాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ ప్రధాన కమిటీల జాబితాలో అన్నమయ్య జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇంతకాలం భుజాలు అరిగిపోయేలా పార్టీని మోసినందుకు ఇదా గుర్తింపు అంటూ మండిపడుతున్నారు. ఒకరికి ఒక పదవికే దిక్కు లేకపోతే మదనపల్లెలో ఇద్దరికీ రెండు పదవులు ఇవ్వడంపై తమ్ముళ్లు సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు ఒక్కోపదవి ఇవ్వగా, పీలేరు, తంబళ్లపల్లెలో ఇప్పటికే కొనసాగుతున్న పదవుల్లోనే వారిని కొనసాగించారు. కొత్తవారికి అవకాశం లేకపోగా వారికి ప్రమోషన్‌ కూడా దక్కలేదు. రాయచోటి, పుంగనూరు నియోజవర్గాలను పూర్తిగా విస్మరించడం, మైనార్టీలకు గత కమిటిలో స్థానం కల్పించగా ఇప్పుడు విస్మరించడంపై ఆ వర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నల్లారి తొలగింపు

గత టీడీపీ జాతీయ కమిటీలో ప్రస్తుత పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్దిపట్ల సూర్యప్రకాష్‌ పదవి పొందారు. ఇప్పుడు ప్రకటించిన కమిటీలో కిషోర్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డికి కమిటీలో చోటు కల్పించారు. మదిపట్లకు అదే పోస్టులో తిరిగి కొనసాగిస్తూ స్థానం కల్పించారు. కిషోర్‌ను పార్టీ పదవి తప్పించడం చర్చనీయాంశమైంది. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కాబట్టి పార్టీ పదవి ఇవ్వలేదని చెబుతున్నప్పటికీ జాతీయ, రాష్ట్ర కమిటీలో ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. అలాంటప్పుడు కిషోర్‌కు ఎందుకు పదవి ఇవ్వలేదని చర్చించుకుంటున్నారు. పార్టీ నిర్ణయాలను ఆయన ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేశారా అని క్యాడర్‌లో చర్చ సాగుతోంది.

ప్రత్యామ్నాయం లేని తంబళ్లపల్లె

తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి కొత్తవారికి ఛాన్స్‌ దక్కలేదు. కొన్నేళ్లుగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిలో కొనసాగుతున్న గిరిజశ్రీ (పర్వీన్‌ తాజ్‌)కు పార్టీ అదే పదవిలో కొనసాగిస్తూ స్థానం కల్పించింది పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ఆమెకు సముచిత స్థానం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. కనీసం పార్టీ పదవిలో ప్రమోషన్‌ కూడా ఇవ్వకుండా ఒకే పదవిలో కొనసాగిస్తున్నారు. ఈమెకు మినహ నియోజకవర్గ నుంచి వేరే ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇప్పటికే ఆమె పౌరసరఫరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

దిక్కులేని పుంగనూరు

పార్టీ కమిటీల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి ఒక్కరికి అవకాశం లేదు. గతంలో వెంకటరమణరాజుకు పార్టీలో స్థానం దక్కేది. ఇప్పుడు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. నియోజకవర్గంలో పార్టీకి బలమైన నేతలు ఉన్నారని చెప్పుకునే పార్టీ కమిటీల్లో ఇప్పుడు ఒక్కరికై నా స్థానం కల్పించకపోవడం వెనక కారణమేమిటి అన్నదానిపై అర్థంకాక తర్జనభజన పడుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని పార్టీ గుర్తించినట్టు లేదని తమ్ముళ్లు మధనపడుతున్నారు.

రాయచోటి నుంచి మైనార్టీలకు ఇచ్చిన అవకాశాన్ని ప్రస్తుత కమిటీలో మొండి చేయి చూపించారు. గత కమిటీలో సుగువాసి ప్రసాద్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, గాజుల ఖాదర్‌బాషాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుత కమిటీలో ఇద్దరికి అవకాశం లేనప్పటికీ ప్రసాద్‌ ప్రస్తుతం రాజంపేట జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. రాయచోటిలో టీడీపీకి మైనార్టీలు, బీసీలు అండగా ఉన్నప్పటికీ వారికి తిరిగి అవకాశం కల్పించలేదు. ఖాదర్‌బాషా ఓ వివాదాస్పద వ్యవహారంతో ఆయన్ను పార్టీ పక్కన పెట్టినప్పటికీ ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఎందుకు ఇవ్వలేదని పార్టీలో చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి మైనార్టీలకు పార్టీ కమిటీల్లో స్థానం కల్పించలేదు. దాంతో మైనార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

మదనపల్లె టీడీపీని ఆదినుంచి మోసిన కుటుంబాలకు అధిష్టానం షాక్‌ ఇచ్చింది. ప్రకటించిన కమిటీలో మాజీ కౌన్సిలర్‌ పి.తులసికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్తకు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చారని,తిరిగి అదే కుటుంబానికి పార్టీ పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ నేతలే సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శిగా పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ను నియమించిన పార్టీ, తిరిగి ఉర్దూ అకాడమీ వైస్‌ చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కమిటీలో తులసికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తవుతోంది. పార్టీలో క్రియాశీలకం పనిచేస్తున్న క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఎన్ని పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బలమైన పార్టీ నేతలను పక్కనపెట్టడంపై ఇన్నాళ్లు పార్టీని మోసినందుకు దక్కిన గౌరవం ఇదేనా అని మధనపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, అధిష్టానంతో సన్నిహితం కలిగిన నేతలు, సీనియర్లను విస్మరించడంపై క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నల్లారి తొలగింపు

రాయచోటి, పుంగనూరులోజెండా మోసిన నేతలే లేరా

జిల్లాలోని టీడీపీ మైనార్టీలకు అన్యాయం

మదనపల్లెలో సీనియర్లను పక్కన పెట్టారు

తంబళ్లపల్లెలో అదే స్థితి

Advertisement
 
Advertisement
Advertisement