గుర్రంకొండ: ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకొని నివాసముంటున్న తమను ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ బోడిగుట్టకు చెందిన దళితులు ఆవేదన చెందుతున్నారు. ఈవియషమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ దళితులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక దళితవాడకు చెందిన పలువురు దళితులకు 50 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు కేటాయించారు. అప్పట్లో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల దగ్గర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి దళితులకు దశలవారీగా ఇళ్లు కట్టుకోవడానికి పట్టాలు ఇచ్చారు. ఎగువ, దిగువ దళితవాడల్లో కలిపి 70 మంది దళితులకు ఇళ్లపట్టాలను రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. వీరికి ప్రభుత్వం ఇళ్లను కూడా మంజూరు చేయడంతో అష్టకష్టాలు పడి హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు నిర్మించుకొన్నారు. అంతాసాఫీగా జరిగిపోతున్న సమయంలో ప్రస్తుతం కొంతమంది రంగ ప్రవేశం చేసి ఈప్రభుత్వ స్థలాలన్నీ మాకే చెందుతాయని వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని దళితులు పేర్కొన్నారు. ఇటీవల ఇళ్ల ముందుభాగంలో ఏర్పాటు చేసుకొన్న పశువుల పాకలను కూడా తొలగించాల్సిందిగా దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న తాము ఎక్కడికి వెళ్లాలంటూ దళితులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై ఇటీవల జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యపై వినతి పత్రాలు సమర్పించారు. దీంతో పాటు స్థానిక రెవెన్యూ, పోలీస్‌అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని హుకుం జారీ చేసి వెళ్లారని దళితులు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
బోడిగుట్టలో ప్రభుత్వస్థలాల్లో
ఇళ్లు కట్టుకున్న దళితుల ఆవేదన


