కలికిరి: మదనపల్లి జాతీయ రహదారి కలికిరి సమీపం టేకలకోన వద్ద ఏపీఐఐసీ ప్రాంగణంలో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగనున్న కార్యక్రమంలో మొదటి రోజున అన్నమయ్య జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు, మతపెద్దలు హాజరయ్యారు. కార్యక్రమానికి దూరం ప్రాంతాల నుంచి విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, స్వచ్ఛంద వలంటీర్లు చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణంలో ముస్లిం సోదరులు ప్రార్ధనలు, సాయంత్రం దువా నిర్వహించారు. గురువారం జరిగే ధార్మిక సభలో ముస్లిం మత పెద్దలు ప్రసంగించనున్నారు.


