కొన్ని రోజులకే మాయం
గుర్రంకొండ: కబ్జాలకు గురవుతున్న కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పలుచోట్ల మాయం అవుతున్నాయి. గతంలో సదరు భూముల్ని కబ్జా చేసిన ఆక్రమణదారులే హెచ్చరిక బోర్డులను రాత్రికి రాత్రే యథేచ్ఛగా తొలగించేస్తున్నారు. దీంతో మళ్లీ రూ. 7కోట్లు విలువచేసే ప్రభుత్వభూముల కబ్జాకు ఆక్రమణ దారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్యాక్రాంతమవుతున్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ఉన్నత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేక పోవడం గమనార్హం.
చిట్టిబోయనపల్లెలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
గుర్రంకొండ పట్టణానికి సమీపంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పక్కనే ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి పక్కనే కోట్లాది రూపాయలు విలువచేసే ఫ్రభుత్వభూములు ఆక్రమణ లకు గురికాకుండా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ పరిసరాల్లోని సర్వేనెంబరు 87/8లో రెండు ఎకరాల భూమికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ పట్టా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఎకరం భూమి రూ.2 కోట్లు వరకు విలువ పెరిగింది. దీంతో కొంతమంది కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ భూమిని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడుకోవడానికి సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా వాటిని కొంతమంది కూటమినేతలు అడ్డుకొని రెవెన్యూ అధికారులను అక్కడి నుంచి పంపించి వేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ తమకబ్జా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల రెవెన్యూ అధికారులు సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబరు 87/8లో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదని ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.
మురాద్‌బీవంక వద్ద బోర్డు ఏర్పాటు:
మండలంలోని ఖండ్రిగ గ్రామంలో ప్రభుత్వస్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని చదును చేసుకున్నారు. మురాద్‌బీ కుంటకు వర్షపునీరు చేరే ఈ వంకను ఆనవాళ్లు లేకుండా చేసి కొంతమంది ఆక్రమించేశారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధం చేసుకొన్నారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ.2 కోట్లు విలువచేసే మొత్తం 50 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు మురాద్‌బీ వంక వద్ద ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు నాటించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని అధికారులు హెచ్చరించారు.
గుర్రంకొండలో మూడు చోట్ల బోర్డులు ఏర్పాటు
గుర్రంకొండ పట్టణంలో గతంలో మూడు చోట్ల రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంను గతంలో కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోగా రెవెన్యూ ఆధికారులు అడ్డుకొని ఆక్రమణలను తొలగించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. పట్టణంలోని తూముకుంటకు వెళ్లే దారిలో రెండు ప్రదేశాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకొనేందుకు యత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకొని అప్పట్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
మళ్లీ మొదలైన కబ్జా యత్నాలూ:
ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటిన తరువాత గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ కబ్జా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బోర్డులు నాటిన భూముల్లో ఉన్న వేపచెట్లతో పాటు ఇతర చెట్లను మెల్లమెల్లగా నరికి వేశారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చదును చేసే పనుల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మురాద్‌బీ వంక చాలా వరకు చదునుచేశారు. వంక రూపురేఖలు మార్చేసి ప్లాట్లు వేసి విక్రయించడానికి సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వంక ఉన్న ఆనవాళ్లు కనుమరుగు అయ్యాయి. ఇప్పటికే మట్టికుప్పలు భూమిలో దర్శనమిస్తుండడం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూమి ఆక్రమణ పనులు మెల్లగా మొదలు పెడుతుండడం గమనార్హం.
మురాద్‌బీ వంక వద్ద హెచ్చరిక బోర్డు నాటిన అధికారులు
కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు నాటుతున్న అధికారులు
గుర్రంకొండ పట్టణంలో ప్రభుత్వభూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు
ప్రస్తుతం సదరు భూమిలో హెచ్చరిక బోర్డు మాయమైన దృశ్యం
అక్రమంగా బోర్డులు తొలగించిన
కబ్జాదారులు
మళ్లీ మొదలైన రూ.7కోట్ల భూముల కబ్జాయత్నాలు
తూతూ మంత్రంగా
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
మండలంలోని గుర్రంకొండ, చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లో గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయయ్యాయి. అన్నిచోట్ల బోర్డులను ఆక్రమణ దారులు తొలగించేశారు. అసలు అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. దీంతో రూ.7 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు మళ్లీ కబ్జా చేసే ప్రయత్నాలను ఆక్రమణ దారులు ముమ్మరం చేశారు.
సదరు స్థలాలు తమ సొంత స్థలాలుగా మార్చేసి మార్కెట్లో విక్రయించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. కొన్ని బోర్డులు తొలగించి సదరు ప్రభుత్వస్థలాల్లో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు రెవెన్యూ అధికారులు అలాంటప్పుడు ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు నాటడం ఎందుకని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.


