మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో మెకానిక్ మృత్యువాత పడ్డ విషాదకర ఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి మృతుని కుటుంబీకులు, నిమ్మనపల్లె పోలీసులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లెకు చెందిన షామీర్ ఖాన్ (45) కందూరు రోడ్డులో మెకానిక్ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం బైకులో సొంత పనిమీద మదనపల్లె రోడ్డులో వెళుతుండగా, మార్గ మధ్యలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టైరు పేలి బైకు అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు సమాచారం అందుకుని బాధితున్ని చికిత్స కోసం హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పంతో బెంగుళూరుకు తరలించారు. అక్కడ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పులిచెర్ల (కల్లూరు): పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. డ్రైవర్, మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు....ప్రొద్దుటూరు నుంచి తమిళనాడు లోని వేలూరు సీఎంసీ హాస్పిటల్‌లో చికిత్స కోసం సరస్వతి (50) అనే మహిళ తన కుమారుని తో కలిసి కారులో బయలు దేరింది. మార్గమధ్యలో బుధవారం తెల్ల వారుజామున కల్లూరు ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సరస్వతి తీవ్రంగా గాయపడింది. 108లో చికిత్స నిమిత్తం పీలేరు హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


