మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో టైలర్ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ, నవోదయ కాలనీలో కాపురం ఉంటున్న టిఎస్. మహబూబ్ బాషా(50) టైలర్ పని చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి వెళ్లి దారాలు, ఇతర సామగ్రి తీసుకు రావాలని రోడ్డుపైకి వచ్చాడు. ఆటో కోసం వేచి ఉండగా ఓ స్కూటర్ వేగంగా వచ్చి టైలర్ ను ఢీకొట్టి వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు చికిత్స నిమిత్తం హుటా హుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం టైలర్ ను రుయాకు తీసుకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


