జాతీయ రహదారికి తూట్లు.. ప్రజలకు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారికి తూట్లు.. ప్రజలకు ఇక్కట్లు

Apr 15 2026 8:14 AM | Updated on Apr 15 2026 8:14 AM

పోటాపోటీగా ప్రైవేటు టెలికాం సంస్థలు తవ్వకాలు

నెల వ్యవధిలో రెండు మార్లు వేర్వేరుగా..

ధ్వంసం అవుతున్న కల్వర్టులు

చోద్యం చూస్తున్న అధికారులు

గుర్రంకొండ : జిల్లాలో ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిపై తవ్వకాలను రెండు ప్రయివేట్‌ టెలికామ్‌ సంస్థలు పోటీపడి మరీ నిర్వహిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలోనే రెండు సంస్థలు వేర్వేరుగా తవ్వకాలు జరిపాయి. దీంతో ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారి ధ్వంసం అవుతూ రూపురేఖలను కోల్పోతోంది.

నెల రోజుల్లో రెండు మార్లు..

జిల్లాలో రూ.350 కోట్లతో అంగళ్లు నుంచి రాయచోటి వరకు ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిని ఏర్పాటు చేశారు. అయితే రహదారి పనులు పూర్తి చేసుకొన్న నాలుగేళ్ల నుంచి ఇప్పటికే పలుమార్లు పలు ప్రయివేట్‌ సంస్థలు, కొంతమంది వ్యక్తులు, సెల్‌ఫోన్‌ కంపెనీలకు చెందిన వారు యథేచ్ఛగా రహదారిపై తవ్వకాలు జరిపారు. అయితే తాజాగా రెండు ప్రముఖ టెలికామ్‌ సంస్థలు జాతీయ రహదారిపై తవ్వకాలు జరపుతున్నారు. నెలరోజుల కింద ఓ కంపెనీ వారు ఇష్టానుసారం రోడ్డును తవ్వేసి గుల్ల చేసి వారి పనులు పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. తాజాగా మరో కంపెనీ వారు ప్రస్తుతం రాత్రింబవళ్లు జాతీయ రహదారిపై తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఎవరి అనుమతి లేకుండా రోడ్డుపైనా, పక్కన జేసీబీలతో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. నెలరోజుల వ్యవధిలో రెండు టెలికామ్‌ సంస్థలు పోటీ పడీ మరీ తవ్వకాలు జరపడం గమనార్హం. దీంతో జాతీయ రహదారి దెబ్బతిని రూపరేఖలు మారిపోతోంది. ఇలాంటి పలుకుబడి ఉన్న వ్యక్తులకు, సంస్థలకు తవ్వకాలు జరుపుకొనేందుకు దరఖాస్తు చేసుకొనేదే ఆలస్యం.. వెంటనే అధికారులు ఆఘమేఘాలపై అనుమతులు ఇచ్చేస్తున్నారు.

రైతులకు ముందస్తు సమాచారం ఏదీ?

ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారి పొడవునా రోడ్డు పక్కనున్న పొలాల వద్ద ప్రయివేట్‌ టెలికామ్‌ సంస్థలు ఇష్టానుసారం తవ్వకాలు జరిపేస్తున్నాయి. అయితే తమ పొలాల వద్ద తవ్వకాలు జరిపే సమయంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోయిన దిగాలు చెందుతున్న రైతులకు పొలాల వద్ద తమ అనుమతి లేకుండా ఇష్టానుసారం నిర్వహిస్తున్న తవ్వకాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెలరోజులుగా పొలాల వద్ద మూడు మార్లు తవ్వకాలు జరిపారని రైతులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ లైన్‌ కోసం ఇప్పటికే ట్రాన్స్‌కో అధికారులు తవ్వకాలు జరిపారు. కాగా నెలరోజుల వ్యవధిలో రెండు ప్రయివేట్‌ టెలికామ్‌ సంస్థలు కేబుళ్ల ఏర్పాటు కోసం రెండుమార్లు తవ్వకాలు జరిపారు. జేసీబీలతో ఇష్టానుసారం పొలాల వద్ద తవ్వకాలు నిర్వహిస్తూ ఇదేమిటని ప్రశ్నించే రైతులకు మీకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. తమ పొలాల వద్ద పనులు చేసే సమయంలో ముందుగా సమాచారం ఇవ్వరా ఆని రైతులు ప్రశ్నిస్తున్నారు. పొలాల కంచెలను, పైపులైన్లను జేసీబీలతో ఇష్టానుసారం ధ్వంసం చేసుకొంటూ పనులు నిర్వహించుకొంటుండటం గమనార్హం. పొలాల వద్ద పెద్ద పెద్ద సిమెంటు తొట్టెలను భూమిలోపల ఏర్పాటు చేసుకొంటున్నారు. రైతుల మాత్రం తమ కళ్ల ఎదుటే ఈ తతంగం అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

రైతులకేనా నిబంధనలు?

ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు కేవలం రైతులకు మాత్రమే వరిస్తాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సాధారణ రహదారిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్‌అండ్‌బీ అధికారుల అనుమతితో రైతులు రోడ్డుకు అవతలి వైపు ఉన్న పొలాలకు రోడ్డు నాలుగు ఇంచుల వెడల్పుతో తవ్వుకొని పైపులైన్లు ఏర్పాటు చేసుకొన్నారు. ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిగా మార్చినప్పుడు అధికారులు ఇష్టానుసారం జేసీబీలతో పైపులైన్లు ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఆ తరువాత రైతులు అవతలి వైపు పొలాలకు పైపులైను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి కోరగా.. అధికారులు ససేమిరా అంగీకరించక పోవడం గమనార్హం. జాతీయ రహదారి కోట్లాది రూపాయలతో నిర్మించామని, ఏళ్ల తరబడి మన్నిక రావాలని, ఇలా పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపితే రోడ్డు నాణ్యత దెబ్బతింటుందని అధికారులు వేదాలు వల్లించినట్లుగా రైతులను బుకాయిస్తు సమాధానాలిచ్చారు. అదే సమయంలో ప్రయివేట్‌ వ్యక్తులకు, కొన్ని ప్రయివేట్‌ సంస్థలకు మాత్రం రోడ్డు మీద తవ్వకాలు జరుపుకొనేందుకు విచ్చలవిడిగా అనుమతులు ఇదే అధికారులు ఇస్తుండడం గమనార్హం. రైతులు పొరపాటున చిన్న పైపు రోడ్డుపై ఏర్పాటు చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లుగా ఆగమేఘాలపై అక్కడ వాలి రైతులను సదరు అధికారులు అడ్డుకొన్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ప్రయివేట్‌ సంస్థలు పైపులైన్లు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చే ఎన్‌హెచ్‌ 340 అధికారులు వ్యవసాయం కోసం పైపులైన్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు తవ్వకాల జరిపేందుకు ప్రయివేట్‌ సంస్థలకు వర్తించే నిబంధనలు, అనుమతులు రైతులకు ఎందుకు వర్తించవని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. రైతుల విషయంలో ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు

నెల రోజుల వ్యవధిలో ఇష్టానుసారంగా రోడ్లపై తవ్వకాలు జరుపుతూ ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారి రూపురేఖలను మార్చేస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై తవ్వకాలు జరిపే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే అధికారులు పనులు జరిగే ప్రదేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో పనులు చేసే సమయంలో పంచాయతీరాజ్‌ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లను జేసీబీలతో ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కళ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారు. ప్రయివేట్‌ టెలికామ్‌ సంస్థలు మాత్రం తమకు నచ్చిన విధంగా పనులు చేసుకొంటూ వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా తవ్వకాలు, తేలిపోయిన కంకర, తూతూమంత్రంగా పూడ్చిన గోతులు దర్శనమిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారి కాస్తా గ్రామీణ రహదారిగా మారిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యహరిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement