సమరయోధుడి కుమారులకు ప్రొసీడింగ్స్‌ పత్రాలు | - | Sakshi
Sakshi News home page

సమరయోధుడి కుమారులకు ప్రొసీడింగ్స్‌ పత్రాలు

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

రామసముద్రం : రామసముద్రంకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీనివాసరావుకు ఎలవనెల్లూరు పంచాయతీ దాసార్లపల్లి వద్ద 6.6 ఎకరాల ప్రభుత్వ భూమిని 1997లో కేటాయించారు. సర్వే నంబరు 100,100/1అ, 100/2లో 6.6 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే 2002లో అప్పటి రెవెన్యూ అధికారులు రద్దు చేయగా, దానిపై శ్రీనివాసరావు కుమారులు అప్పీలుకు వెళ్లారు. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూమిని సెటిల్మెంట్‌ చేస్తూ ఆయన కుమారులు వెంకట రమణారావు, సీతారామయ్య, బాపూజీకు హక్కు కల్పిస్తూ తహసీల్దార్‌ అజారుద్దీన్ను ఆదేశించారు. దీంతో తహశీల్దార్‌ శ్రీనివాసరావు కుమారులకు ఆ భూమిపై హక్కు కల్పిస్తూ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.

దారి ఆక్రమణపై ఫిర్యాదు

కేవీపల్లె : మండలంలోని కేవీపల్లె పంచాయతీ గంగువారిపల్లెలో పొలాలకు వెళ్తున్న దారి ఆక్రమణపై అదే గ్రామానికి చెందిన ఎన్‌.వెంకటరమణారెడ్డితోపాటు గ్రామస్తులు రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు.. సర్వే నంబరు 180లో పొరంబోకు స్థలం గుండా పొలాలకు దారి ఉందని గ్రామస్తులు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు ముళ్లకూసాలు నాటి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో దారి సమస్య ఏర్పడిందని పరిష్కరించాలని కోరారు. పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇరు వర్గాలకు ఒప్పించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయంపై తహసీల్దార్‌ నరేంద్రకుమార్‌ను వివరణ కోరగా మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రామస్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు.

స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం

మోపిదేవి : కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప వాస్తవ్యులు కె.వేణుగోపాలరెడ్డి, విశాలాక్ష్మి దంపతులు రూ.50,116 విరాళంగా మంగళవారం సమర్పించారు. ముందుగా వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement