కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ మెన్ టీ20 మ్యాచ్‌లు ఎంతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ టీ20 మ్యాచ్‌లో అనంతపురం జట్టు 12 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, కడప 8 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మంగళవారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్‌లో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ జట్టులోని వంశీకృష్ణ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 53 బంతుల్లో 2 ఫోర్లు, 12 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. జహీర్ అబ్బాస్ 85 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 1, సూర్య చరణ్ 1, దీపన్ సాయినాథ్ 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 49, జివి చరణ్‌జిత్ 55 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆరిస్ బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కడప జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నెల్లూరుపై అనంతపురం జట్టు విజయం
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 19.3 ఓవర్లకు 168 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోఫిత్ యాదవ్ 48, సాకేత్‌రామ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున అద్భుతంగా చక్కటి లైనప్‌తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. వినయ్‌కుమార్ 2, ప్రమోద్‌కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 12.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని సాకేత్‌రామ్ 3 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ20 మ్యాచ్‌ల్లో అనంతపురం జట్టు 15 పాయింట్లతో ముందంజలో ఉండగా , కడప 12 పాయింట్లతో రెండవ స్థానం, నెల్లూరు జట్టు 8 పాయింట్లతో మూడవ స్థానం, చిత్తూరు జట్టు 4 పాయింట్లతో నాల్గవ స్థానం సాధించింది. కాగా కర్నూలు జట్టు సున్నా పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది.
టి.వంశీకృష్ణ,
107 పరుగులు (కడప)
మల్లికార్జున, 4 వికెట్లు
(అనంతపురం)
జహీర్ అబ్బాస్,
85 పరుగులు (కడప)
ఆరిఫ్ బాషా,
3 వికెట్లు (కడప)


