మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకున్న ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జరప్పల్లికి చెందిన రెడ్డెప్ప భార్య చైత్ర(26) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి చైత్రను వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. డాక్టర్ల సలహా మేరకు చైత్రను బయటి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నదమ్ములపై కర్రలతో దాడి
మదనపల్లె టౌన్ : ఇంటి నిర్మాణం అడ్డుకొని అన్నదమ్ములపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. మంగళవారం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోంపాళ్యంకు చెందిన అన్నదమ్ములు ఊరికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో పునాది వేసి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన మారయ్య ఆ స్థలం తమదంటూ గొడవకు దిగాడు. గొడవ తారా స్థాయికి చేరింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో మారయ్య తన అనుచరులు అన్నదమ్ములు కుమార్, అనీల్ పై విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదారు. వారికి గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వారిని ఆస్పత్రిలోనే చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఘర్షణ సమాచారంపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


