– సాక్షి కథనంపై టూరిజం డీవీఎం
మదనపల్లె : ఈనెల 13న సాక్షిలో ప్రచురితమైన ‘పని లేని పర్యాటకశాఖ’ కథనంపై టూరిజం తిరుపతి డివిజనల్ మేనేజర్ శ్రీనివాసులు స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో సాక్షి కథనం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని చెబుతూనే, అందులో పేర్కొన్న అంశాలన్నీ నిజాలేనని స్పష్టంగా అంగీకరించారు. సాక్షిలో పేర్కొన్నట్టుగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పలమనేరు, కుప్పం యూనిట్లను ప్రయివేటుకు అప్పగించడం జరిగిందని తెలిపారు. బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ యూనిట్‌లో అతిథి గృహల అభివృద్ధికి, ఆధునికీకరణకు రూ.10 కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులు చేపట్టగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్ణీత గడువులో పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం పనులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో సాక్షిలో రాసిన కథనం నిజమేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
స్కూటర్ ఢీకొని వృద్ధుడికి గాయాలు
మదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని వృద్ధుడు గాయపడిన సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన రైతు వెంకటరమణ(65) సొంత పనిమీద మదనపల్లెకు వచ్చాడు. స్థానిక చిత్తూరు బస్టాండులో బస్సు దిగి రోడ్డు పక్కన అంగడి వద్దకు నడిచి వెళుతుండగా ఓ స్కూటరిస్టు వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితున్ని అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు యజమాని జిల్లా ఆస్పత్రికి తరలించాడు. దీంతో వృద్ధుడు ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


