సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరంలోని వివాదాస్పద విజయదుర్గ కాలనీ వెంచర్ అనుమతులపై విచారణ వేగవంతమైంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వేసిన ఈ వెంచర్ వల్ల కేసీ కెనాల్, రహదారి స్థలం అన్యాక్రాంతమైంది. చుట్టుపక్కల భూములతో కలిపి చదును చేసినట్లు తీవ్ర ఆరోపణ ఉంది. నిబంధనలను కేసీ కాలువలో తొక్కుతూ.. ఎంచక్కా కమీషన్లు తీసుకుంటూ అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇన్నాళ్ల తర్వాత సంజాయిషీ ఇచ్చేందుకు జేసీ ఎదుట హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా ప్రశ్నలకు సదరు అధికారులు ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయే దుస్థితి వచ్చింది. టౌన్ ఫ్లానింగ్ అధికారుల అక్రమార్జన కారణంగా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా కార్పొరేషన్ యంత్రాంగం క్యూ కట్టాల్సి వచ్చింది.
● రెండు దశాబ్దాల క్రితం విజయదుర్గ కాలనీ వెంచర్ వేశారు. అప్పట్లో రైతుల భూములతో పాటు ఆ భూములకు ఉన్న కాలువలు, కాలువకు ఇరువైపులా ఉన్న దారి దాదాపు 2.5 ఎకరాలు అన్యాక్రాంతమైందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పత్రికల్లో కథనాలు సైతం వెలుగుచూశాయి. ఆమేరకు అడపదడపా ఉన్నతస్థాయిలో పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి సదరు అధికారులు వెంచర్ యజమానులకు అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ వ్యవహారాన్ని తొక్కిపెట్టేవారు. అప్పట్లో కార్పొరేషన్ అధికారుల పాలిట విజయదుర్గ వెంచర్ కామధేనువుగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
విజయదుర్గా వెంచర్‌లో అక్రమాలు ... ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం వ్యవహారం విచారణ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిఽధిమీనాకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమేరకు ఫైల్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అప్పట్లో పనిచేసిన కమిషనర్లు ఆలీంబాషా, శ్యాంసన్, ఓబులేసు, చంద్రమౌళీశ్వరరెడ్డిలను ఇటీవల పిలిపించారు. వారితో పాటు అప్పట్లో తహశీల్దార్‌గా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి, టౌన్ ఫ్లానింగ్ అధికారులు కృష్ణ సింగ్, శారదమ్మలను సైతం పిలిపించి అడ్డగోలు అనుమతుల వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఎంత ఉందంటూ అధికారుల వివరణను జాయింట్ కలెక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఒక్కమారుగా అధికారులంతా అవాక్కయ్యారు. మరీ ముఖ్యంగా టౌన్ ఫ్లానింగ్ అధికారులు తేలుకుట్టిన దొంగలా ఉండిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. నదులు, కాలువల పొరంబోకు స్థలం అన్యాక్రాంతం వ్యవహారంపై కోర్టు తీర్పులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ముందు పనిచేసిన అధికారుంతా బిక్కమొహం వేసినట్లు తెలుస్తోంది. వివరణ ఇచ్చేందుకు ఈనెల 30 వరకూ గడువు కావాలంటూ ఆయా అధికారులు జాయింట్ కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఆ మేరకు ఇదివరకూ కడపలో పనిచేసిన కమిషనర్లు ఆ నలుగురు అధికారులు మరోమారు కడపకు రావాల్సి ఉంది. రెండు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ విజయదుర్గ వెంచర్ వ్యహారం జాయింట్ కలెక్టర్ నిధిమీనా నేతృత్వంలోనైనా ఒ కొలిక్కి వస్తుందేమో చూడాలి.
విజయదుర్గ కాలనీ వెంచర్‌అనుమతుల ఆరోపణలపై కూపీలాగుతున్నారు!
ఇదివరకూ పనిచేసినకమిషనర్లకు తాఖీదులు
జేసీ ఎదుట విచారణకు హాజరు
సంజాయిషీ కోసం ఈనెల 30 వరకుగడువు కోరిన కమిషనర్లు
తేలుకుట్టిన దొంగల్లా టౌన్ ప్లానింగ్ యంత్రాంగం


