ఫలితం ఎలాగైనా రానీ...ప్రయత్నం కొనసాగనీ! | - | Sakshi
Sakshi News home page

ఫలితం ఎలాగైనా రానీ...ప్రయత్నం కొనసాగనీ!

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

మదనపల్లె సిటీ: మార్కులు, ర్యాంకుల కన్నా జీవితం ఎంతో ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలైతే ఇంకోసారి రాసేందుకు అవకాశం ఉంటుంది. కుంగుబాటుకు గురై తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే విలువైన జీవితానికి ఇంకో సప్లిమెంటరీ ఉండదు. అందుకే ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నం అనే ప్రయాణాన్ని కొనసాగిస్తే మున్ముందు ఎన్నో మంచి మైలురాళ్లు కనిపిస్తాయి. వాటిని చేరుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదల అవుతున్న నేపథ్యంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు చాముండేశ్వరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.

ప్రియమైన విద్యార్థులకు...

విజయం అనేది ఒక మార్కు షీట్‌లోనే ఉండదు. పట్టుదల, నమ్మకంలో ఉంటుంది. ఈ రోజు వచ్చిన ఫలితం మీ శ్రమకు ఒక అంచనా మాత్రమే. మార్కులు తగ్గినా, ఫెయిలైనా మీకు ప్రతిభ లేనట్లు కాదు. మీ భవిష్యత్తును అది ఏ మాత్రమూ ప్రభావితం చేయదు. ఒక ఫలితం మీ విలువను నిర్ణయించదు. మీ ప్రయత్నమే మీకు అసలైన గుర్తింపు. జీవి తం ఒక పరీక్ష కాదు. పరీక్షలు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ రోజుటి ఫలితాన్ని బట్టి మీరు ఏ మాత్రం కుంగిపోవద్దు. స్నేహితులతో తల్లిదండ్రు లతో మాట్లాడండి. సానుకూలంగా ఉండండి. మరో ప్రయత్నంతో మంచి ఫలితం తప్పకుండా వస్తుంది.

గౌరవనీయులైన తల్లిదండ్రులకు...

ఈ రోజు మీ ఒక్క చూపు. ఒక్క మాట. మీ పిల్లల మనసులో జీవితాంతం నిలుస్తుంది. వారిని హత్తుకొని ఫలితం ఎలా వచ్చినా ఫర్వాలేదని ముందే చెప్పండి. ఒకవేళ ఆశించిన ఫలితం రాకుంటే వారు కొంచెం బాధలో ఉంటారు. మార్కులే మీకు గౌరవమని భావించకండి. ఇతరులతో పోలుస్తూ మీ వాళ్లను తక్కువ చేయొద్దు. వారి ఆనందమే మీకు నిజమైన సంపద. వాళ్లను బాధపెట్టకండి. అండగా నిలవండి. ఏం ఫర్వాలేదు మేమున్నామనే భరోసా ఇవ్వండి. మీ ఆత్మీయత, మీరిచ్చే ఽధైర్యం వారి జీవితాన్ని మార్చగలదు.

నేడు ఇంటర్మీడియట్‌ ఫలితాలు

Advertisement
 
Advertisement
Advertisement