భానుడి భగభగ! | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ!

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

భానుడి భగభగ!

జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్‌ రెండో వారమే ఇలాగుంటే ఈ నెలాఖరును తట్టుకోగలమా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, పట్టణాలే కాక, పల్లెల్లోనూ జనం వ్యవసాయ పనులు, పనుల నిమిత్తం మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. దాంతో రద్దీ తగ్గగా రహదారులు, వీధుల్లోనూ జన సంచారం భారీగా తగ్గిపోయింది. జిల్లా కేంద్రం మదనపల్లె చల్లని ప్రాంతం. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మదనపల్లె సహా నియోజకవర్గ కేంద్రాలు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి పట్టణాల్లో ఎండల ప్రభావం కనిపిస్తోంది. మంగళవారం నెలకొన్న ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 వరకు నమోదవ్వగా, పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై 34 డిగ్రీలు నమోదుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మండుతున్న హార్సిలీహిల్స్‌

సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి మండుటెండలోనూ చల్లటి ఆహ్లదకరనమైన వాతావరణం కలిగే ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్‌ సైతం మండిపోతోంది. కొండపై ఎంతటి ఎండలోనూ 24 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. అలాంటి మంగళవారం 34 డిగ్రీలకు చేరింది. ఇంతటి ఎండలు ఎప్పుడులేవని పర్యాటకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలతో ఆంధ్రాఊటీ పేరు చెదిరిపోయే ప్రమాదం కనిపిస్తోంది. హార్సిలీహిల్స్‌పైనా ఎండలు ఉంటే ఇక ప్రత్యేకత అంటూ లేకుండాపోతుంది. దీనికి ప్రధాన కారణంగా చుట్టూ దట్టమైన అటవీప్రాంతం కలిగిన కొండను కాంక్రీటు వనంగా మార్చేస్తున్నారు. అనధికార కట్టడాలు మితిమిరిపోతున్నా అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లతో నిస్సహాయంగా మారింది. పదేళ్లుగా పర్యావరణం ఊహించని విధంగా మారడానికి నిర్మా ణాలు, పారిశుద్ధ్యం, వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వినియోగం. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement