లోకేష్‌ మాటలు.. నీటి మూటలు | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ మాటలు.. నీటి మూటలు

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

లోకేష్‌ మాటలు.. నీటి మూటలు

లోకేష్‌ మాటలు.. నీటి మూటలు

కాశినాయన : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్‌ వ్యవహార శైలి ఉంది. మాట ఇవ్వడం.. ఆపై మరుగునపరచడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో నారా లోకేష్‌ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. ఏడాది క్రితం కాశినాయన క్షేత్రంలో అటవీ శాఖ అనుమతులు లేవంటూ అటవీ అధికారులు కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడ తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని హడావుడి చేసి కూలగొట్టిన కట్టడాలను తానే సొంత డబ్బులతో పూర్తి చేస్తానన్న లోకేష్‌ ఓ చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు ఆ క్షేత్రంలో సమస్యలు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’అన్న చందంగా మారాయి. కాశినాయ క్షేత్రంలో కొన్ని సత్రాలు, ఇతర నిర్మాణాలను అటవీ శాఖ కూల్చివేసింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కూల్చివేతలపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అప్పటికే అనుమతుల కోసం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కేంద్ర అటవీశాఖ మంత్రికి వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. అనుమతులు మంజూరు కాలేదు. ప్రభుత్వం మారడంతో చంద్రబాబు సర్కార్‌ అక్కడ కూల్చివేతల పర్వం చేపట్టింది. ఈ వ్యవహారంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని భయపడిన మంత్రి నారా లోకేష్‌ హడావుడి చేశారు. ఏకంగా తన పీఏ కేకే చౌదరిని పంపించి నిర్మాణాలను దగ్గరుండి కట్టించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రచార మాధ్యమాల్లో కూడా హడావుడి చేశారు. ఆయన పీఏ నాలుగు రోజులు ఇక్కడే మకాం వేసి రూ.5లక్షలతో పడగొట్టిన రేకుల షెడ్‌ను నిర్మాణం చేపట్టి వెళ్లిపోయారు.

అటవీ అనుమతులపై హంగామాతో సరి

కాశినాయన క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ భక్తులు గుడి నిర్మాణం చేపట్టారు. నిత్యాన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం అటవీ అనుమతులు లేవంటూ ఆలయ నిర్మాణాన్ని అటవీ అధికారులు నిలిపివేశారు. జ్యోతి క్షేత్రానికి 13 హెక్టార్ల స్థలాన్ని ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి కావడంతో కాశినాయన క్షేత్రంలో కట్టడాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రధాన సమస్య అటవీ అనుమతులు తీసుకురావడమే. కాగా మంత్రి నారా లోకేష్‌ నెలలోపల అటవీ అనుమతులు తెప్పించి పునర్నిర్మాణం చేపడుతామన్న మాటలు నీటి మూటలే అయ్యాయి. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం, నేతలు స్పందించి జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement