23న తరిగొండ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీలకీ్‌ష్మ్‌నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈమేరకు టీటీడీ గురు వారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి.
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన గుండా సురేంద్రను వైఎస్‌ఆర్‌సీపీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ కార్యాలయం ప్రకటించింది. తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి, అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ అలూరి సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి అన్నమయ్య: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా రాయచోటికి చెందిన గాజుల హాజిబాష, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా రాజంపేటకు చెందిన కల్లూరు రమేష్‌గౌడ్, జిల్లా ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రాయచోటికి చెందిన వి.సురేష్‌కుమార్‌రెడ్డిలను నియమించారు.
పీలేరు రూరల్: నాలుగేళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ శివారు ప్రాంతంలోని ఓ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం మదనపల్లె మార్గంలోని ఓ కాలనీలో గురువారం నాలుగేళ్ల చిన్నారి అంగన్‌వాడీ స్కూల్ నుంచి ఇంటికి చేరుకుంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలుడు (16) ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడే సమయంలో సమీప బంధువులు గుర్తించి కేకలు వేశారు. బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు.
కేవీపల్లె: పశువులకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్‌పిళ్ళై అన్నారు. గురు వారం మండలంలోని సొరకాయలపేట గ్రామీణ పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పశువులకు, గొర్రెలకు వ్యాధులు సోకకుండా సమయానికి టీకాలు వేయాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సమయం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవో శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
పీలేరురూరల్: జిల్లాలో గ్రామ పంచాయతీ పన్నులు సకాలంలో వసూలు చేయాలని డీపీవో ఎ.రాధమ్మ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది రూ.15 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.8.50 కోట్లు మాత్రమే వసూలు అయిందని తెలిపారు. కలికిరి, మదనపల్లె, వాల్మీకిపురం, అంగల్లు, పీలేరులో పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో యుగంధర్, పంచాయతీ కార్యదర్శులు సిగ్బతుల్లా, జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


