అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
● పోలీస్ కుటుంబాలలో నిండిన
నూతనోత్సాహం
● కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలి
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఆయన సతీమణి ఉమ శ్రీలక్ష్మీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నిత్యం విధులు, కవాతులు, శిక్షణలతో కనిపించే పోలీస్ మైదానం సంక్రాంతి సందడితో ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. జిల్లా ఎస్పీ కుటుంబం నుంచి కిందిస్థాయిలోని హోంగార్డు కుటుంబ సభ్యుల వరకు సంక్రాంతి వేడుకలలో పాల్గొనడంతో ఆ ప్రాంతం ఆనందం, ఆహ్లాదభరితంగా కనిపించింది. సంక్రాంతి పండుగ ఒక కులానికో, మతానికో పరిమితమైంది కాదని, శ్రమజీవులైన రైతులు, కూలీల పండుగని ఎస్పీ కొనియాడారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన శుభవేళ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమన్నారు. ఇలాంటి వేడుకలు పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సహాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు.
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు
పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టాన్ని అతిక్రమించినా అలాంటి వారిని చట్టపరంగా ఉపేక్షించవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వారికి స్నేహితుడిగా, అతిక్రమించేవారికి సింహస్వప్నంగా ఉండాలన్నా రు. వేడుకలలో భాగంగా మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గులు పోటీలను ఎస్పీ సతీమణి ఉమ శ్రీలక్ష్మీ ప్రారంభించి విజేతలను ఎంపిక చేశారు. మ్యూజికల్ చైర్స్, డ్రాయింగ్ పోటీలు, తంబోలా, గోళీలు, బొంగరాలు వంటి ఆటలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు స్వయంగా పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి అందరిలో ఉత్సా హాన్ని నింపారు. కార్యక్రమం చివరిలో వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి, వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఇతర పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు


