హత్యాయత్నం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు
కడప అర్బన్ : జిల్లాలోని పులివెందుల అప్ గ్రేడ్ పీఎస్ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు పిట్టు గౌతమ్ కుమార్ రెడ్డి(27), యకాసి జనార్ధన అలియాస్ జనార్ధన్ (30) లకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ సోమవారం కడప ఏ.ఎస్.జె కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ సంఘటనలో ఫిర్యాది దేరంగుల గణేష్ కుమార్(25) వద్ద నిందితులలో ఒకరైన గౌతమ్‌కుమార్ రెడ్డి తన మోటార్ సైకిల్‌ను రూ.70 వేలకు తనఖా పెట్టాడు. 2023 మే 26వ తేదీ మధ్యాహ్నం సదరు మోటార్ సైకిల్‌ను తనఖా నుంచి విడిపించుకునే విషయంలో ఫిర్యాదికి, నిందితుడు గౌతమ్‌కుమార్ రెడ్డికి మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం గౌతమ్ కుమార్ రెడ్డి, తన స్నేహితుడైన జనార్దన్ సహకారంతో కత్తి తీసుకుని ఫిర్యాదిని చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. చార్జ్ షీట్‌ను కోర్టు కు సమర్పించారు. సోమవారం కడప అదనపు సెషన్‌న్స్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సాకా్‌ాష్ధరాలు పరిశీలించి నిందితులపై నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు, 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో అడిషనల్ పి.పి ఎల్.బాలాజీ, తన బలమైన వాదనలతో నిందితులకు శిక్ష పడేలా చేశారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత పులివెందుల సీఐ సీతారామి రెడ్డి, కడప కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ (హెచ్.సి 1988), పులివెందుల కోర్ట్ కానిస్టేబుల్ నూర్‌బాషా లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించినారు.


