14న మకరజ్యోతి దర్శనం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో ఈ నెల 14న మకరజ్యోతి దర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఆ రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరు ఆభరణాలను కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా తీసుకువచ్చి అయ్యప్ప స్వామికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ తూర్పు దిక్కున ఉండే కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
భక్తితోనే ముక్తికి మార్గం
కలకడ : ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది అని పరమపూజ్య శ్రీధర్ చరణ్‌దాస్ స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని ఎనుగొండపాళ్యం పంచాయతీ దిగువపాళ్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యం కొనసాగేలా సహకారం అందించాలన్నారు. చేసే పనిలో మంచి ఉండాలని, భక్తితోనే ముక్తికి మార్గం సాధ్యమని తెలియజేశారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన గండన్న కుమారుడు కృష్ణప్ప(55) టీవీఎస్ ఎక్సెల్ వాహనంలో పొలం వద్దకు గడ్డి తెచ్చేందుకు వెళుతుండగా, తంబళ్లపల్లె మండలం ఎర్రగుంట్లపల్లె పూలబావి వద్ద ఎదురుగా వచ్చిన జీపు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కర్ణాటక కోలారుకు చెందిన దంపతులు చంద్రశేఖర్, శశికళ(26) తమ కుమార్తెతో కలిసి గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ దేవాలయానికి బైక్‌పై బయలుదేరారు. మార్గంమధ్యలో మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లె వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్‌బ్రేకర్ దాటే క్రమంలో వెనుక కూర్చున్న శశికళ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అక్రమంగా బీర్ల తరలింపు
కడప అర్బన్ : కడప నగర శివారులోని కేంద్ర కారాగారం సమీపంలో ఆదివారం కారులో అక్రమంగా రెండు కేస్ (20 బీర్లు) తరలిస్తున్న కె.సురేష్ అనే వ్యక్తిని రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్, కే. సముద్రం నివాసి అయిన కె.సురేష్ కడపలో బీర్లను కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. బీర్లను, కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
14న మకరజ్యోతి దర్శనం
14న మకరజ్యోతి దర్శనం


